గత రెండుమూడు వారాలుగా కేంద్రప్రభుత్వం, డిల్లీ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న కీచులాటలు ఈరోజు పతాకస్థాయికి చేరుకొన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై సంతకాలు చేయనందుకు ఇద్దరు ఐ.ఏ.ఎస్. అధికారులను సస్పెండ్ చేసింది. అందుకు వారు ముఖ్యమంత్రిని కలిసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయకుండా శలవుపై గోవా వెళ్ళిన డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కి పిర్యాదు చేసారు. వారిని సస్పెండ్ చేసినందుకు నిరసనగా ఏకంగా రెండు వందల మంది ఐ.ఏ.ఎస్. అధికారులు రేపటి నుండి మూకుమ్మడిగా శలవుపెట్టి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చేరు. డిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యం తగ్గించే ప్రయత్నాలలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రేపటి నుండి డిల్లీలో సరి-బేసి సంఖ్యల వాహనాల పద్దతిని ప్రయోగాత్మకంగా అమలుచేయబోతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలో ఒకేసారి 200మంది అధికారులు శలవు పెట్టడంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ శిసోడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
“నిన్న ప్రధాని నరేంద్ర మోడి, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ లతో ఐ.ఏ.ఎస్. అధికారులు ఆన్-లైన్ ద్వారా మాట్లాడిన తరువాతే వారు శలవుపై వెళ్ళడం గమనిస్తే, కేంద్రప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కుట్ర పన్నిందని అర్ధమవుతోంది. కేంద్రప్రభుత్వం మా ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు సృష్టించాలో అన్నీ సృష్టిస్తోంది. కానీ మేము డిల్లీ ప్రజలకు తప్ప మరెవరికీ భయపడబోము. శలవులో వెళ్ళిన ఐ.ఏ.ఎస్. అధికారులు అందరూ ఆరు నెలలు విధులకు హాజరుకాకపోయినా మాకేమీ ఇబ్బంది లేదు. మా ప్రభుత్వం సమర్ధంగా పరిపాలన కొనసాగిస్తుంది. ప్రభుత్వానికి సహకరించవలసిన ఉన్నతాధికారులే ప్రభుత్వాన్ని ఈవిధంగా ఇబ్బందిపెట్టడం సరి కాదు. వారి తీరును, కేంద్రప్రభుత్వం కుట్రలను డిల్లీ ప్రజలు కూడా గమనిస్తున్నారు,” అని మనీష్ శిసోడియా అన్నారు.
ఈ యుద్ధానికి శ్రీకారం చుట్టింది కేంద్రప్రభుత్వమేనని చెప్పక తప్పదు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంలో లేని సమయంలో ఆయనకి తెలియజేయకుండా సిబీఐ అధికారులు ఆయన కార్యాలయంపై దాడులు నిర్వహించి, డిల్లీ ప్రధానకార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంలో నుంచి కొన్ని కాగితాలు తీసుకుపోయారు. ఆ తరువాత రాజేంద్ర కుమార్ పై చార్జ్ షీట్ దాఖలు చేసారు. అప్పటి నుండి డిల్లీలో రెండు ప్రభుత్వాల మధ్య యుద్ధం జరుగుతోంది. డి.డి.సి.ఏ. వ్యవహరంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీపై చేస్తున్న ఆరోపణలకు మోడీ ప్రభుత్వం జవాబు చెప్పుకోలేని పరిస్థితి ఎదుర్కొంటోంది. సరిగ్గా ఇదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఇద్దరు ఐ.ఏ.ఎస్. అధికారులను సస్పెండ్ చేయడంతో కేంద్రప్రభుత్వం ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈవిధంగా ఇబ్బందిపెడుతోంది. కేంద్రప్రభుత్వం అండదండలు లేకపోతే ఐ.ఏ.ఎస్. అధికారులు ఇంతకు తెగించేవారు కాదనే విషయం ఎవరయినా తేలికగా ఊహించగలరు. ఇదే సమయంలో ఆ ఇద్దరు అధికారుల సస్పెన్షన్ చెల్లదని కేంద్రప్రభుత్వం ప్రకటించడం గమనిస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది.