సూర్యాపేట జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారింది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారయ్యాయి. ఉత్తంకుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి ముచ్చటగా మూడోసారి పోటీకి దిగుతుండగా ఆయన సతీమణి పద్మావతి రెడ్డి రెండోసారి కోదాడ నియోజకవర్గం పోటీ చేయనున్నారు. సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ ను రాంరెడ్డి దామోదర్ రెడ్డికే కేటాయించారు. తుంగతుర్తి నియోజకవర్గానికి మాత్రం అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. దామోదర్ రెడ్డి అనుచరుడుగా డాక్టర్ వడ్డేపల్లి రవి… గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిన అద్దంకి దయాకర్ లలో ఒకరికి టిక్కెట్ దక్కే అవకాశం ఉంది. రెండు నెలల క్రితం కెసిఆర్ మొదటి విడతలోనే సూర్యాపేట మంత్రి జగదీష్ రెడ్డి కి తుంగతుర్తి గాదరి కిషోర్ లకు టికెట్లు ఖరారు చేయడం చేయడంతో విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు.
రేవంత్ రెడ్డి తో కలిసి టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన సూర్యాపేట నేత పటేల్ రమేష్ రెడ్డి టిక్కెట్ లభించకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. నియోజకవర్గంలో ప్రజలతో మమేకమైన రమేష్ రెడ్డికి ప్రజల్లో మంచి ఊపు ఉందనే చెప్పవచ్చు. దామోదర్ రెడ్డితో కలిసి సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేయడం కష్టమేనన్న ప్రచారం ఉంది. ఢిల్లీ వార్ రూమ్ లో అధిష్టానం సూచనలు మేరకు ఎంపీ గా వెళ్తారా లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో దిగాలని విషయంపై అనుచరులతో పటేల్ సమావేశమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కేవలం రెండువేల తేడాతోనే జగదీష్ రెడ్డి చేతిలో ఓటమి పాలైన సంకినేని వెంకటేశ్వరరావు ఈసారి బిజెపి అభ్యర్థిగా పోటీకి దిగారు. గ్రామస్థాయిలో తనదైన శైలిలో విస్తృత ప్రచారం చేస్తున్నారు.
టీఆర్ఎస్ తరపున కోదాడ , హుజూర్నగర్ నియోజకవర్గాల్లో టిక్కెట్లు పెండింగ్లో ఉన్నాయి. కోదాడ నుంచి మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు రేసులోఉన్నట్లు చెప్పుకున్నారు. కానీ తాజాగా ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి టికెట్ ఖరారైనట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
కోదాడ నియోజకవర్గంలో మహా కూటమి లో టిడిపి నుంచి టికెట్ వస్తుందని ఆశించిన బొల్లం మల్లయ్య యాదవ్ కు నిరాశే ఎదురయింది. దీంతో మల్లయ్య యాదవ్ స్వతంత్రంగా అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. తన అనుచరులతో జరిగిన సమావేశంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతానని తేల్చి చెప్పి తనను ఆదరించాలని కోరారు. మొత్తంగా సూర్యాపేట జిల్లా రాజకీయ కెమిస్ట్రీ క్లిష్టంగా మారిపోయింది.