పలాయనవాదం అంటేనే అది దిగజారుడు తనానికి పరాకాష్ట. సదరు పలాయనవాదంలో కూడా మరింత దిగజారుడుతనం అంటే ఎలా ఉంటుందో మోడీ సర్కారు మన తెలుగు ప్రజలకు రుచిచూపించ దలచుకున్నట్లున్నది. ఒక సభ్యుడు ప్రవేశ పెట్టిన బిల్లుమీద సగం చర్చ జరిగిన తర్వాత.. కేవలం కోరం లేదనే మిషమీద మిగిలిన చర్చను ఓటింగ్‌ను వాయిదా వేసి, దానికి ఒక నిర్దిష్ట తేదీని నిర్ణయించి ఆ తేదీకంటె ముందే… సభా అధిపతి ప్రకటించిన చర్చ మరియు ఓటింగ్ జరగక ముందే సభను వాయిదా వేసేయడం అనేది చాలా ఘోరమైన చర్యగా తెలుగు ప్రజలు గర్హిస్తున్నారు. రాజ్యసభను గురువారం నాడు వాయిదా వేయడానికి నిర్ణయించడం తెలుగుజాతిని అవమానించడమే అని పలువురు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా గురించి కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రెవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఆరోజున సగం చర్చ జరిగిన తర్వాత.. ఆయన ఓటింగ్‌కు పట్టుపట్టారు. దీంతో ఛైర్మన్ సభ్యులను లెక్కించి కోరం లేదంటూ ఓటింగును 13వ తేదీకి వాయిదా వేశారు. ఈలోగా కేవీపీ రామచంద్రరావు తెలుగుదేశానికి చెందిన చంద్రబాబుకు మద్దతు కోసం లేఖ రాయడం, వెంకయ్యకు లేఖ రాయడం ఇవన్నీ జరిగాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా కూడా ఏపీ ప్రత్యేకహోదాకు వెన్నంటి నిలవడానికి నిర్ణయించింది.
ఈ బిల్లు మీద ఓటింగ్‌లో విధిగా పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్ విప్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బలంలేని భాజపాలో బెదురు పుట్టింది. ఏపీకి ప్రత్యేకహోదా బిల్లు సభామోదం పొందితే తమ పరువు పోతుందని 13వ తేదీకి రెండు రోజుల ముందే సభను నిరవధిక వాయిదా వేయడానికి పన్నాగం పన్నారు. అయితే కొందరు సభ్యుల పదవీ విరమణ కారణంగా వీడ్కోలు చెప్పడం అనే లాంఛనం ఉన్నందున గురువారం కూడా సభను నిర్వహించి, ఆ లాంఛనం పూర్తిచేసి సభను వాయిదా వేయనున్నారు. హోదా విషయంలో తమ చేతగాని తనం, వంచన బట్టబయలు కాకుండా మోడీ సర్కారు కుట్ర ఇది అని తెలుగు ప్రజలు ఏవగించుకుంటున్నారు.