విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం ఓ పరిశ్రమగానే లెక్క కడుతోంది. నష్టాలొస్తున్నాయి.. అమ్మేస్తున్నాం అంటోంది. ఒక వేళ ఎవరూ కొనకపోతే మూసేస్తామని నిర్మోహమాటంగా చెబుతోంది. నిజానికి అది ఒక పరిశ్రమ మాత్రమేనా..? అని ప్రశ్నించుకుంటే… కానే కాదనే సమాధానం సగటు ఆంధ్రుడి నుంచి రావాలి. ఇప్పటి తరానికి అది ఓ పరిశ్రమగానే కనిపించవచ్చు కానీ.. విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రను కాస్త కదిపితే.. తెలుగువాడి పోరాట పటిమ కనిపిస్తుంది. భవిష్యత్ తరాల కోసం ప్రాణాలు అర్పించిన త్యాగం నిలువెత్తున కన్నీళ్లు పెట్టిస్తుంది. ఊళ్లకు ఊళ్లు ఖాళీగా చేసి భూములు ఇచ్చేసిన త్యాగధనుల త్యాగం సాక్షాత్కరిస్తుంది. అన్నీ కలిపి విశాఖ ఉక్కు అంటే.. తెలుగువాడి ఆత్మగౌరవం. అలాంటి ఆత్మగౌరవాన్ని ఇప్పుడు కేంద్రం అమ్ముతానంటోంది. వేరే వాళ్లు కొంటానంటున్నారు. కానీ విషాదం ఏమిటంటే ప్రాణాలు త్యాగం చేసి తెచ్చుకున్న పరిశ్రమను అంపశయ్య మీద పెట్టేస్తే.. ఇప్పుడు ఆంధ్రుల్లో చలనం లేదు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మాత్రమే పోరాడాల్సి వస్తోంది. అందుకే.. స్టీల్ ప్లాంట్ వెనుక ఉన్న ఆంధ్రుడి ఆత్మగౌరవాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం.
ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకూ ప్రాణత్యాగాల ఫలం..!
‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు ” ఇదేదో రాజకీయ పార్టీ స్లోగన్‌లా అనిపించవచ్చు. ఇప్పటి తరం కాదు.. రెండు తరాల ముందు ఇదో తెలుగువాడి గుండెల్లో పాతుకుపోయిన నినాదం. 1960వ దశకం విద్యార్థులు, యువత ఆకాంక్షల నుంచి పుట్టిన నినాదం. తెలుగు వారందరినీ ఏకం చేసి, మహోజ్వల పోరాటానికి తెరతీసిన అపూర్వ ఘట్టం. తెలుగు జాతి ఉక్కు సంకల్పానికి ప్రతీక. ఇక్కడ తెలుగు జాతి అంటే… ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకూ ఉంది. అందరూ తెలుగువాళ్లమనే భావన అప్పుడు ఉంది. ఇంకా తెలుగువాళ్లు విభజనకు గురి కాలేదు. నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల్లోనూ ఉద్యమం ఉద్ధృతంగా సాగింది. గుంటూరుకు చెందిన అమృతరావు నిరాహార దీక్ష ఉద్యమాన్ని మలుపు తిప్పింది.
ప్రతీ తెలుగోడి గుండె నినదిస్తే పుట్టిన ఉద్యమ ఫలం..!
1966, నవంబరు ఒకటో తేదీన విశాఖలో పోలీసు కాల్పులు యావత్ దేశాన్నీ కలవరపెట్టాయి. వాళ్ల కర్కశత్వానికి తొమ్మిదేళ్ల బాబూరావుతో సహా మరో ఎనిమిది మంది బలయ్యారు. ఆ రోజు విశాఖలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ ఉద్యమంలో విశాఖ వాసులు మొత్తం పన్నెండు మంది ప్రాణాలు వదిలారు. ఆందోళనకారులపై పోలీసుల కాల్పుల్లో.. తగరపువలసలో ఒకరు, అదిలాబాద్‌లో ఒకరు, విజయవాడలో ఐదుగురు, విజయనగరంలో ఇద్దరు, కాకినాడలో ఒకరు, వరంగల్‌లో ఒకరు, సీలేరులో ఒకరు, గుంటూరులో ఐదుగురు చనిపోయారు. మొత్తం మీద విశాఖతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి ప్రాణ త్యాగ ఫలితమే విశాఖ స్టీల్ ప్లాంట్.
రాజీనామాలతో ప్రజాప్రతినిధులు సృష్టించిన సంక్షోభ ఫలితం..!
అది ప్రజల ఉద్యమం మాత్రమే కాదు.. రాజకీయ పార్టీలల ఉద్యమం కూడా. స్టీల్ ప్లాంట్ కోసం.. అప్పటి ఏలూరు ఎమ్మెల్యే ప్రత్తి శేషయ్య హైదరాబాద్‌లో ఆమరణదీక్ష చేశారు. ఓ రోజు అర్థరాత్రి పోలీసులు అరెస్టు చేసి, ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనికి నిరసనగా గౌతు లచ్చన్నతో పాటు 67మంది శాసనసభ్యులు, ఏడుగురు లోక్‌సభ సభ్యులు రాజీనామా చేశారు. అప్పటి రాజకీయ నాయకులు పదవులను తృణప్రాయంగా త్యజించారు. పోరాడారు. దీనికి కారణం అప్పటికే తెలుగు వారికి తీవ్ర అన్యాయం జరగడం. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత.. మద్రాసు నగరాన్ని ‘కోల్పోయామ’న్న అసంతృప్తి ప్రజల మనసునుంచి చెరిగిపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడి అప్పటికి పదేళ్లు అయ్యాయి. పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా అన్ని పరిశ్రమలు ఉత్తరాదికి వెళ్తున్నాయి. ఏపీని పట్టించుకోలేదు. అందుకే రాజకీయ నేతలు ఉక్కుపిడికిలి బిగించారు. ప్రజలు పోరాటాలకు సిద్ధమయ్యారు.
మోసపోయే దుస్థితిలో తెగించిన పౌరుషానికి ప్రతీక..!
దక్షిణాదిలో స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకున్న తర్వాత కూడా ఒడి దుడుకులు ఎదురయ్యాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా ఉక్కు కర్మాగారాన్ని తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. ఉక్కు కర్మాగారాన్ని తమిళనాడుకో, కర్ణాటకకో తరలిస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోసారి అన్యాయానికి గురవుతున్నామన్న ఆవేదన తలెత్తింది. అది పోరాటాల రూపంలో బయటకు వచ్చింది. కొద్ది రోజులకే కాలేజీలు, స్కూళ్ల విద్యార్థులు ఉద్యమంలోకి వచ్చి ముందు వరుసలో నిలుచున్నారు.తరగతుల బహిష్కరణ, బంద్‌లు, హర్తాళ్లు, సభలు, సమ్మెలు, నిరాహార దీక్షలు సాగాయి. కాల్పులు జరిగిన మూడేళ్ల తర్వాత.. 1970 ఏప్రిల్ 17న.. విశాఖలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పార్లమెంటులో ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటన చేశారు.
భూమి తృణప్రాయంగా ఇచ్చేసిన వేల మంది త్యాగఫలం ..!
1960, 70ల మధ్యలో ఫ్యాక్టరీ కోసం 64 గ్రామాల్లో 26 వేల ఎకరాల భూమి సేకరించారు. కురుపాం జమీందారు ఆరువేల ఎకరాలు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ వస్తే బతుకులు బాగుపడతాయన్న ఉద్దేశంతో ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేసి ఇచ్చేశారు అక్కడి ప్రజలు. దాదాపుగా పదహారు వేలమందికిపైగా నిర్వాసితులు ఉంటారు. కొంత మంది పరిహారం ఇచ్చారు. ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఇప్పటికీ.. అనేక మందికి పరిహారం అందలేదు. ఉద్యోగాలు రాలేదు. ఇలాంటి వారికి రీహాబిటేషన్ కార్డులు ఇచ్చారు. వాటినే వారసులకు రెన్యూవల్ చేస్తూ పోతున్నారు. ప్రస్తుతం ఈ ప్లాంటు 26,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని సామర్థ్యం ఏటా 7.3 మిలియన్ టన్నులు. దాదాపు 16,000 మంది శాశ్వత ఉద్యోగులు, 17,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. పరోక్షంగా మరో లక్ష మంది ఉపాధి పొందుతున్నారు. విశాఖకు ఓ బ్రాండ్‌గా స్టీల్ ప్లాంట్ ఉంది. ఏపీ మొత్తానికి అతి పెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఒకటిగా ఉంది.
ఉద్యమాభిమానంతో గుండెలు ఉప్పొంగే చరిత్ర ఉన్నా… ఇప్పుడు ఎందుకు అంత అంత నిర్లక్ష్యం..?
ఇంత ఘన చరిత్ర… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆత్మీయ అనుబంధం.. భావోద్వేగ సంబంధం ఉన్న స్టీల్ ప్లాంట్ ను ఇప్పుడు తెగ నమ్మడానికి కేంద్రం నిర్ణయించింది. ఇదే తెలుగువాడి గుండె కోతకు కారణం అవుతోంది. ప్రాణ త్యాగాల విలువ … పోరాటాల ప్రతిఫలం ఏదీ ఇప్పుడు పరిగణనలోకి రావడం లేదు. ఈ చరిత్ర తెలిసిన తర్వాతైనా కొత్త తరం తెలుగువాడి గుండె పోరాట స్ఫూర్తితో రగులుతుందని ఆశిద్దాం..!