ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో ఎక్కువ మంది రకరకాల బిజినెస్‌లు చేసుకుంటూ ఉంటారు. అందుకే ఇండియాలోనే రిచెస్ట్ కేబినెట్‌గా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పేరుగాంచింది. ఇండియా మొత్తం మీద అత్యంత ధనికుడైన రాష్ట్ర మంత్రి కూడా ఆంధ్రప్రదేశ్‌కి చెందినవాడే. రాజకీయ నాయకుడెప్పుడూ కూడా పదవి కోసం చూస్తూ ఉంటాడు. ఆ పదవి కోసం ఏం చేయడానికైనా సిధ్ధపడతాడు. తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితులలో, వయసు సహకరించనప్పటికీ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబులు పాదయాత్రలకు సిద్ధపడడానికి కూడా కారణమదే. అయితే రాజకీయాల్లోకి వచ్చిన వ్యాపారస్తుల ప్రాథమ్యాలు మాత్రం వేరే ఉంటాయి. పదవితో పాటు వచ్చే వ్యాపార ప్రయోజనాలకే వాళ్ళు పెద్ద పీట వేస్తారు. నిజాయితీగా బిజినెస్ చేసే వాళ్ళే అయితే కోట్ల రూపాయలు వెదజెల్లి టిక్కెట్లు కొనుక్కోరు. అవినీతితో, అక్రమ వ్యవహారాలతో సంపాదించిన ఎవ్వరూ కూడా అధికారంలో ఉన్నవాళ్ళతో శతృత్వం కొని తెచ్చుకునే సాహసం చేయరు.
ఇప్పుడు సీమాంధ్రలో జరుగుతున్న వ్యవహారమదే. చంద్రబాబునాయుడు, జగన్యోహన్రెడ్డిలు ఇద్దరూ కూడా మోడీతో ఫైట్ చేయడానికి రెడీగా లేరు. కేసుల భయంతో పాటు..ఆ ఇద్దరినీ నమ్ముకున్న వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు కాపాడడం కూడా వాళ్లిద్దరి బాధ్యత. ఆ విషయంలో తేడాలు వస్తే వచ్చే ఎన్నికలలో వైసిపి, టిడిపిల ఎన్నికల ఖర్చును భరించడానికి ఎవ్వరూ ముందుకురారు. అందుకే వచ్చే రెండు సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్ నాయకులెవ్వరూ కూడా మోడీకి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడరు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడినా, ఆ మాటలకు పెద్దగా విలువ ఉండదు. ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మీడియా కీ రోల్ ప్లే చేయాలి. ఓట్ల కోసం వచ్చినప్పుడు ఒకలా చెప్పి…ఎన్నికలయ్యాక ఇంకోలా మాట్లాడుతున్న నాయకులపైన ప్రజలలో వ్యతిరేకత వచ్చేలా మీడియా వాళ్లు ప్రయత్నించాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలన్నీ కూడా ఏదో ఒక పార్టీకి సంబంధించినవే. రాజకీయ పార్టీలతో సంబంధంలేని వాళ్ళకేమో బోలెడన్ని వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా పైన చెప్పిన సూత్రమే వర్తిస్తుంది.
ఇలాంటి పరిస్థితులలో పోరాటం, ఉద్యమం అనే పదాలకు అవకాశం లేదు. అలా అని పూర్తిగా మౌనంగా ఉండడం కూడా కుదరదు. వాస్తవాలు ప్రజలకు తెలిసిపోతాయి. అదే జరిగితే అసలుకే మోసం వస్తుంది. అందరినీ ఛీ కొట్టే పరిస్థితి వస్తుంది. ప్రత్యేక హోదా కోసం నిజాయితీగా ప్రయత్నించే పరిస్థితి లేదు కాబట్టి పోరాడుతున్నట్టుగా కనిపించాలి. అది కూడా ప్రత్యర్థి పార్టీ కంటే మేమే ఎక్కువ ప్రయత్నిస్తున్నాం అని జనాలను నమ్మించడం వరకే. ఇప్పుడు చంద్రబాబు, జగన్‌లు చేస్తుంది అచ్చంగా ఇదే. ఇద్దరూ ఏదో ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీవాళ్ళు అసమర్థులని, వాళ్ళసలు ఏమీ చేయడం లేదని విమర్శిస్తున్నారు. జగన్, చంద్రబాబుల వ్యవహారాలకు తగ్గట్టుగానే వాళ్ళ వెనుక ఉన్న మీడియా సంస్థల రాతలు కూడా ఉంటున్నాయి. ప్రజల్లో స్పందన వచ్చినప్పుడు మాత్రం నాయకులు, మీడియా సంస్థలు కూడా…ఆ ప్రజల కోసం పాటుపడుతున్నట్టుగా కనిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ వేడి చల్లారిపోగానే ఎక్కడి వాళ్ళు అక్కడ గప్ చుప్ అన్నట్టుగా సర్దుకుంటున్నారు. ఇంతటి ఘటనాఘటన సమర్ధులు కనుకనే ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు సహకరించి కూడా అన్యాయానికి గురైన సీమాంధ్ర ప్రజల దృష్టిలో హీరోలుగానే నిలబడగలిగారు. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో కూడా అలాంటి విజాయన్ని సాధించారంటే మాత్రం…ఆ తర్వాత నుంచీ సీమాంధ్ర ప్రజలను మోసం చేయడానికి ఏ ఒక్క నాయకుడు కూడా వెనుకాడకపోవచ్చు.