రాజకీయ నేతలు సెటిల్మెంట్లు చేస్తారని.. అందులో ఎంతో కొంత వెనకేసుకుంటారని అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి అవకాశం ఉంటుందనే.. ఉనికి లేని పార్టీల్లో ఏదో ఓ పదవి కోరుకుంటూ ఉంటారు కొంత మంది. ఇలా సెటిల్మెంట్ చేసేటప్పుడు కొంచెం అయినా మానవత్వంతో వ్యవహరించకుండా … పేదలను పీల్చిపిప్పి చేస్తే మాత్రం వాళ్లు నేతలు కాదు రాబందలవుతారు. ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఇలాంటి ఓ వివాదంలో చిక్కుకున్నారు. బిడ్డను పోగొట్టుకున్న ఓ మహిళకు న్యాయం చేస్తానని చెప్పి.. ఆమె తరపున మధ్యవర్తిత్వం వహించి.. .వచ్చిన నష్టపరిహారాన్ని తాను కాజేశారు. ఆ డబ్బులు ఇచ్చేది లేదంటూ ఆ పేద మహిళను బెదిరిస్తున్నారు. ఈ ఆరోపణలతో కృష్ణా జిల్లాలో ఆమెపై నమోదైన కేసు కలకలం రేపుతోంది.
ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం గ్రామదర్శని – గ్రామ వికాసం పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లోకి వెళ్లి సమస్యలు పరిష్కరించడం ఈ కార్యక్రమ ఉద్దేశం. గన్నవరం ఎమ్మెల్యే వంశీమోహన్ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా తన నియోజకవర్గంలోని ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామానికి వెళ్లారు. అక్కడ ఓ మహిళ తన సమస్య చెప్పుకోవడానికి భయపడి… కన్నీటి పర్యంతమయింది. సమస్యేమిటో తెలుసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను పురమాయించారు. భయం భయంగా ఆ మహిళ తనకు జరిగిన నష్టాన్ని వివరించింది. ఆమె పేరు మరియం బీ. ఆమె కుమారుడు రెండేళ్ల కిందట ఓ చెరువులో పడి చనిపోయాడు. ఓ గెదేల ఫారం యజమాని అక్రమంగా తవ్వించిన చెరువులో పడిపోయాడు. ఈ విషయం తెలిసి సుంకర పద్మశ్రీ.. డబ్బులు ఇప్పిస్తానని మధ్యవర్తిత్వానికి వచ్చారు. గెదెల ఫారం యాజమాని దగ్గర లక్షల రూపాయలు వసూలు చేశారు. కానీ మరియంబీకి ఇవ్వలేదు. పైగా బెదిరింపులకు పాల్పడుతున్నారు.
వెంటనే మరియంబీని పోలీసులకు ఫిర్యాదు చేయమని ఎమ్మెల్యే సూచించారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సుంకర పద్మశ్రీ… రాజకీయ పరమైన ఆరోపణలే చేస్తున్నారు. తాను డబ్బులు తీసుకున్న మాట నిజమే కానీ.. తనకు ఎవరిచ్చారో వాళ్లే రావాలంటూ వితండ వాదం చేస్తున్నారు. తన ఎదుగుదలను ఓర్చుకోలేక టీడీపీ నేతలు..ఇలా చేస్తున్నారంటున్నారు. కొద్ది రోజుల కిందట.. ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేనిపై విమర్శలు చేసి కొన్ని రోజులు మీడియాలో ప్రచారం పొందారు సుంకరపద్మశ్రీ. ఇప్పుడు ఇలా మళ్లీ మీడియాకు ఎక్కారు.