వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ కు ఉద్యోగుల తరలింపు మొదలైంది. అయితే వేల సంఖ్యలో వున్న ఫైళ్ళను తీసుకు రావడానికి కొంతకాలం పట్టేలా వుంది. ఉద్యోగ వర్గాల ప్రాధమిక అంచనా ప్రకారం రెండు రాష్ట్రాలకూ సంబంధించి 40 వేల ఉమ్మడి ఫైళ్ళు , 20 వేల పుస్తకాలు వున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య ఫైళ్ళ విభజన, పుస్తకాల పంపిణి జరగాలి.
ప్రస్తుతం సచివాలయంలో రికార్డ్ లైబ్రరీ, సెంట్రల్ రికార్డు బ్రాంచ్, న్యాయశాఖ లైబ్రరీ, ప్లానింగ్ లైబ్రరీలు ఉన్నాయి. కీలకమైన ఫైళ్లు అన్నీ ఈ నాలుగు విభాగాల్లోనే నిల్వ ఉన్నాయి.
న్యాయశాఖ లైబ్రరీలో దాదాపు 20 వేల వరకు పుస్తకాలు, ఫైళ్లు ఉన్నాయి. అలాగే ప్రణాళిక శాఖ లైబ్రరీలో 10 వేలు, సాధారణ పరిపాలన విభాగంలో రెండు రాష్ట్రాలకు సబంధించిన 15 వేల ఫైళ్లు ఉన్నట్లు ప్రాధమికంగా అంచనా వేశారు. వీటిల్లో గెజిట్, చట్టాలకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇక జనాభా లెక్కల వివరాలు, నిజాం కాలం నాటి పత్రాలు కూడా భారీగానే ఉన్నాయి.
ఫైళ్ళ విభజన, పంపకం – భవనాలు కట్టినంత, ఉద్యోగులు వచ్చినంత తేలిక కాదు. బేసక్ ఫైళ్ళు, అనుబంధ ఫైళ్ళను చదవాలి. ఏరాష్ట్రానికి చెందినదో నిర్ధారించుకోవాలి. ఇది ఒక రాష్ట్రవల్లకాక రెండు రాష్ట్రాలూ కలసి కూర్చుని చేసుకోవలసిన పని. ఇందుకు తెలంగాణాకు తొందరేమీలేదు. సొంత ఇంట్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశే ఫైళ్ళు తెచ్చుకోవాలి. ఫైళ్ళ విభజనకు జాయింకమిటీ ఏర్పాటు చేయవలసిన అవసరం గురించి తెలంగాణా ప్రభుత్వానికి ఉత్తరరాయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు నిర్ణయించారు.