నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డిక్టేటర్’ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతున్న సంగతి అభిమానులు అందరికీ తెలుసు. సాధారణంగా సంక్రాంతి పండుగ సమయంలో విడుదలయిన బాలయ్య బాబు సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతుంటాయి. కనుక ఈ సినిమాపై కూడా ఇండస్ట్రీలో, అభిమానులలో చాలా భారీ అంచనాలే ఉన్నాయి. వాటికి తగ్గట్టు ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఒక ప్రముఖ టీవీ చానల్ ఏకంగా రూ.6కోట్లు చెల్లించి స్వంతం చేసుకొన్నట్లు తాజా సమాచారం. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని భావిస్తునందునే అంత భారీ మొత్తం చెల్లించి తీసుకొందని వేరేగా చెప్పుకోనవసరం లేదు. బాలయ్య బాబు కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయిపోయినట్లు సమాచారం.
ఈ సినిమాలో అంజలి,సోనాల్ చౌహాన్ మరియు అక్ష పరదసాని హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకి ప్రముఖ రచయితలు కోన వెంకట్ మరియు గోపి మోహన్ కధ అందించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. ధామన్ దీనికి సంగీతం అందించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన శ్రీవాస్ ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి నిర్మించారు. అంటే దర్శకుడు కూడా ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నట్లు స్పష్టం అవుతోంది. కనుక అందరి అంచనాలను నిజం చేస్తూ ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆశిద్దాము.