కోవిడ్ కారణంగా రెండు రకాల పరిణామలు ఇండ్రస్ట్రీలో కనిపిస్తున్నాయి. ఒకటి.. షూటింగులు ఆపేయడం. రెండోది… సినిమాల్ని చుట్టేయడం. ఈమధ్యే మొదలైన సినిమాలు, రిలీజ్ డేట్ ఇంకా టైమున్న సినిమాలు… కోవిడ్ కారణంగా షూటింగుల్ని ఆపేశాయి. ఇంకొన్ని మాత్రం ఎంత త్వరగా వీలైతే.. అంత త్వరగా సినిమాని ముగించాలన్న తాపత్రయంలో చుట్టుడు కార్యక్రమంలో దిగిపోయాయి.
వీలైనంత తక్కువమంది సిబ్బందితో షూటింగులు జరుపుకోవాలని ఫిల్మ్ ఛాంబర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అంత తక్కువ మంది సిబ్బందితో షూటింగులు జరపడం కష్టం కాబట్టి… చాలా సినిమాల చిత్రీకరణలు ఆగిపోయాయి. ఇప్పటికైతే.. షూటింగులకు అనుమతి అయినా ఉంది, పూర్తిగా షూటింగులకు బ్రేక్ వేయకముందే… సినిమాల్ని పూర్తి చేస్తే చాలనుకుంటున్నారు కొంతమంది నిర్మాతలు. ముఖ్యంగా ఓటీటీనే టార్గెట్ చేసుకున్న కొన్ని సినిమాలు ఇప్పుడు త్వరిత గతిన షూటింగులు ముగించాలని చూస్తున్నాయి. ఎందుకంటే.. మళ్లీ లాక్ డౌన్ వచ్చి, షూటింగులు పూర్తిగా ఆపేస్తే.. అప్పుడు ఎటూ కాని పరిస్థితి. ఓ అగ్ర హీరో సినిమాని సైతం ఇలానే ముగించేయాలని చిత్రీకరణలో వేగం పెంచారు. ఆఖరికి.. ఓ పాట, కొన్ని సన్నివేశాల్ని సైతం కత్తిరించారు. వాళ్ల టార్గెట్ ఈ నెలాఖరుకి షూటింగ్ పూర్తి చేయడమే.
భవిష్యత్తులో ఎలాంటి భయంకరమైన రోజులువస్తాయో చెప్పలేం. దేశమంతా లాక్ డౌన్ అంటే.. థియేటర్లు ఇప్పట్లో రీ ఓపెన్ చేసే పరిస్థితి లేకపోతే, ఓటీటీనే దిక్కు. వాటికి సినిమాని అమ్ముకునైనా, పెట్టుబడి రాబడదాం అనుకునే నిర్మాతలకు ఇంతకు మించిన మార్గం మరోటి కనిపించడం లేదు మరి.