విజయవాడ తెదేపా కార్పొరేటర్ కాకమాను మల్లిఖార్జున యాదవ్ త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఒక సినిమా తీయబోతున్నారు. దాని పేరు చంద్రోదయం. రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన ఏవిధంగా కష్టపడుతున్నదీ అందులో వివరిస్తారు. ఆ సినిమాకి ఒంగోలుకి చెందిన పసుపులేటి వెంకట రమణ కధ, దర్శకత్వం వహించనున్నారు. శ్వేతార్కే క్రియేషన్స్ మణికంట బ్యానర్ పై ఈ సినిమా నిర్మించబోతున్నారు. సినిమా స్క్రిప్ట్ కూడా సిద్దం అయిపోయింది. ఆగస్ట్ 4వ తేదీన ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప ఒంగోలులో షూటింగ్ ప్రారంభిస్తారు. ఈ సినిమా షూటింగ్ ప్రధానంగా విజయవాడ, యానాం ప్రాంతాలలో జరుగుతుందని నిర్మాత మల్లికార్జున యాదవ్ చెప్పారు. చంద్రుని వెన్నెలని ఏవిధంగా ప్రజలందరూ ఆస్వాదిస్తారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు పాలనని కూడా ఓటర్లు(?) అందరూ ఆస్వాదిస్తారనే ఉద్దేశ్యంతోనే ఈ చంద్రోదయం సినిమా నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆక్కటుకొనే అంశాలు ఉంటాయని దర్శకుడు చెప్పారు.
ఈ సినిమాలో చంద్రబాబు నాయుడుని ఆయన పాలనని గొప్పగా చూపించబోతున్నారని స్పష్టం అయ్యింది. కానీ, దీనిని డాక్యుమెంటరీ చిత్రంగా తీయడం లేదు. కనుక ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రని ఎవరు పోషించబోతున్నారనే సంగతి ఇంకా తెలియవలసిఉంది. రామాయణం సినిమా తీస్తున్నప్పుడు రాముడే కాదు లక్ష్మణుడు, సీతమ్మవారు, వానరసేన అలాగే విలన్ రావణుడు తప్పనిసరి. కనుక ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు హీరో కనుక ఆయనతో బాటు నారా లోకేష్, మంత్రులు, తెదేపా నేతలు కూడా ఉంటారు. సినిమా రక్తి కట్టాలంటే తప్పనిసరిగా బలమైన విలన్ కూడా చాలా అవసరం కనుక జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉండవచ్చు. విలన్ గ్యాంగ్ లో రఘువీరా రెడ్డి, ఇంకా అవసరమనుకొంటే కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలని కూడా చేర్చవచ్చు. కనుక ఈ సినిమా సూపర్ హిట్ అవడం ఖాయం. అప్పుడు కాంగ్రెస్, వైకాపాలు కూడా చిత్ర నిర్మాణం మొదలుపెడతాయేమో..మొదలుపెడితే అందులో విలన్ ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.