ఏపీలో ఈ సారి సినిమా స్టూడియోను నిర్మించి తీరాలన్న ప్రభుత్వ పట్టుదలకు కొంత మంది సినీ పెద్దలు తమ వంతుగా ప్రయత్నిస్తామని ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే విశాఖలో రామానాయుడు స్టూడియో ఉన్నా అది జగన్ ముఠా చేతిలో సగం చిక్కిపోయింది. మిగతా ది షూటింగ్లకు ఎంత మేర ఉపయోగపడుతుందో చెప్పలేని పరిస్థితి. అందుకే ఈ సారి భారీ స్టూడియోను నిర్మించాలని అనుకుంటున్నారు. ఉత్తారంధ్ర గోదావరి జిల్లాల్లోనే ఈ స్టూడియో నిర్మాణం జరుపుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇటీవల కొంత మంది సినిమా పెద్దలు పవన్ కల్యాణ్ ను కలిశారు. చంద్రబాబును కలిసేందుకు రెడీ అవుతున్నారు. ఆ లోపు ఆయన వద్ద పూర్తి స్థాయి స్టూడియో ప్రతిపాదనను పెట్టాలనుకుంటున్నారు. ప్రభుత్వం వద్ద ఆయాచితంగా భూములు తీసుకోకుండా.. కొనుగోలు ప్రక్రియ ద్వారానే స్టూడియో కడితే.. భవిష్యత్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏపీలో షూటింగ్ లు తగ్గిపోయాయి. టిక్కెట్ల రేట్లు పెంచాలంటే ఏపీలో షూటింగ్ చేయాలని రూల్ పెట్టారు కానీ.. అలాంటిదేమీ పాటించకుండానే టిక్కెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇస్తున్నారు.
ఏపీలో కూడా… సినిమా, డిజిటల్ రంగాల చిత్రీకరణలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తే… ఎంతో కొంత సినీ రంగం పుంజుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. చంద్రబాబునాయుడు హయాంలో ప్రయత్నాలు జరిగినా.. అది మొదట్లోనే ఆగిపోయాయి. విశాఖలో ఫిల్మ్ నగర్ కు స్థలాలిచ్చినా చివరికి అది వైసీపీ గుప్పిట్లోకే పోయింది. ఈ సారి అలాంటి పరిస్థితి రానీయకూడదని అనుకుంటున్నారు.
ఒక్క ప్రొడ్యూసర్ లేదా.. పెట్టుబడిదారు స్టూడియో కట్టడం అనేది ఇప్పుడు సాధ్యం కాదని… ఓ గ్రూపుగా ఏర్పడి చేయాల్సిందేనని భావిస్తున్నారు. ఈ విషయంలో పడే ముందడుగు ఏపీలో సినీ ఇండస్ట్రీకి పునాది అవుతుందని అనుకోవచ్చు.