ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “అమ్మఒడి” పథకంపై.. వారానికో మాట మాట్లాడుతోంది. ఇప్పటికి అధికారం చేపట్టి నాలుగు వారాలయింది. ఈ నాలుగు వారాల్లో.. ఆ పథకంపై.. నాలుగు మాటలు చెప్పింది. ఒక్కొక్కరు… ఒక్కొక్క ప్రకటన చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు. చివరికి ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో ఆదివారం ఓ ప్రకటన బయటకు వచ్చింది. కానీ దాని మీద ఎలాంటి అధికారిక ముద్రల్లేవు. దాంతో.. దానిపైనా.. కచ్చితంగా.. అదే మాట మీద ఉంటారన్న నమ్మకం ప్రజలకు లేకుండా పోయింది.
“అమ్మఒడి” పథకం అసలు ఉద్దేశం ఏమిటి..?
నవరత్నాల్లో ఒకటైన .. “అమ్మఒడి”ని జగన్మోహన్ రెడ్డితో పాటు.. వైసీపీ కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. ఇది సింగిల్ పాయింట్ పథకం. ఏ బడికి పంపినా సరే.. పిల్లలున్న తల్లులకు.. రూ. పదిహేను వేలు ఏడాదికి ఇస్తామనేది.. ఆ పథకం. జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పారు… ఏ బడికి పంపిస్తున్నారనేది కాదు… బడికి పంపితే అందరికీ ఇస్తామని.త ఈ పథకం బాగానే పారింది. స్కూలు ఫీజులు, ఇతర ఖర్చులు తడిసిమోపిడవుతున్న తల్లులు.. పోలోమంటూ వెళ్లి ఓట్లేశారు.
మంత్రులెందుకు వ్యతిరేక ప్రకటనలు చేశారు..?
అయితే ఎన్నికలు ముగిసి..జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పరిస్థితి మారిపోయింది. “అమ్మఒడి” పథకం ప్రభుత్వ స్కూళ్లకేనంటూ… ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. దాంతో.. వైసీపీ అనుకూల మీడియా.. సంబరాలు చేసుకుంది. గొప్ప.. నిర్ణయం అంటూ… కథనాలు ప్రచురించింది. ఆ తర్వాత విద్యామంత్రి కూడా.. అదే రకమైన ప్రకటన చేశారు. “అమ్మఒడి”పథకం ప్రస్తుతం.. ప్రభుత్వ పాఠశాలలకేనని చెప్పేశారు. అదే సమయంలో మంత్రుల ప్రకటనలపై.. సీఎంవో నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దాంతో.. ప్రభుత్వం యూటర్న్ తీసుకుందన్న కలకలం ప్రారంభమైంది. బడికి పిల్లల్ని పంపే.. తల్లిదండ్రుల్లో కలవరం కనిపించింది. దీంతో.. మళ్లీ యూటర్న్ తీసుకోకతప్పలేదు.
ప్రజాస్పందనపై టెస్టింగ్ చేసి… వనక్కి తగ్గారా..?
రాష్ట్రంలో బడికి వెళ్లే ప్రతి పిల్లవాడి కుటుంబానికి రూ. పదిహేను వేలు ఇవ్వాలంటే… కొన్ని వేల కోట్ల ఆర్థిక భారం పడుతుంది. దీన్నుంచి తప్పించుకోవడానికి కొన్ని పరిమితులు పెట్టాలనుకున్నారని.. మొదటగా.. ప్రభుత్వ స్కూళ్లకే పరిమితం చేయడం… అందులోనూ ఆరు నుంచి పదో తరగతి చదివే వారికే ఇస్తారన్న ప్రచారం చేయడం ప్రారంభించారు. ఈ ప్రచారాన్ని జనంలోకి పంపి. . వారి స్పందనను తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ జనంలో.. ప్రతిస్పందన చాలా నెగెటివ్‌గా ఉండటంతో.. వెంటనే.. సీఎంవో కార్యాలయం నుంచి క్లారిటీ వచ్చినట్లుగా.. ఓ లెటర్ రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది.
సీఎంవో కార్యాలయం ప్రకటనపై నిలబడతారా..?
“అమ్మఒడి” పథకంపై.. ఇప్పటికి ప్రభుత్వ వర్గాల్లో తర్జనభర్జన జరుగుతోంది. జనవరి ఇరవై ఆరో తేదీన తల్లుల చేతుల్లో చెక్కులు పెడతామని జగన్ ప్రకటించారు. అంతకు ముందే రైతులకు.. భరోసా చెక్కులు పంపిణీ చేయాలి. ఇలా.. వచ్చే ఆరు నెలల్లో కొన్ని వేల కోట్ల అదనపు నిధులు సమీకరించాలి. ఈ క్రమంలోనే… అధికారుల్లో అలజడి ప్రారంభమయింది. “అమ్మఒడి” పథకంపైనే వారు ప్రధానంగా చర్చిస్తున్నారు. భారం తగ్గించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే.. సీఎంవో ప్రకటన అధికారికంగా విడుదల చేయలేదు. ఆ ప్రకటనపై .. ఎలాంటి అధికారిక ముద్రల్లేవు. దీంతో.. “అమ్మఒడి”పథకంపై.. ప్రభుత్వం ఏం చేయబోతోందనే ఆసక్తి మాత్రం ప్రారంభమయింది.