బిహార్ అసెంబ్లీ చివరి దశ ఎన్నికలు ఈరోజు ఉదయం ఏడు గంటలకి మొదలయ్యి సాఫీగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని సీమాంచల్ అనే ప్రాంతంలో ఉన్న మధుబని, దర్భంగా,సుపౌల్, మదేపూర, సహస్ర, అరారియా, కిసాన్ గంజ్, పూర్ణియా మరియు కటిహార్ జిల్లాలో గల 57 స్థానాలకి ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ 57 స్థానాలకి మొత్తం 827 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఈ 57 నియోజక వర్గాలలో మొత్తం 1, 55, 43, 594 ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు: 81, 84, 948; మహిళలు: 73,51,277 ఉన్నారు. వారి కోసం ఎన్నికల సంఘం మొత్తం 14,709 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేసింది. వాటిలో 14, 722 పోలింగ్ బూత్ లలో ఈవిఎం (ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్) లతో పోలింగ్ నిర్వహిస్తుంటే మిగిలిన 18,866 పోలింగ్ బూత్ లలో బ్యాలట్ పేపర్స్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఈ ఐదవ దశ ఎన్నికల ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ఎన్డీయే, జనతా పరివార్ కూటములు పోటీ చేయడం లేదు. ఈ దశలో శరద్ పవార్ కి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, పప్పు యాదవ్ కి చెందిన జన్ అధికార లోక్ తాంత్రిక్ పార్టీ, ఓవైసీలకు చెందినా మజ్లీస్ పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ జరుగుతోంది. బిహార్ లో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన మజ్లీస్ పార్టీ ముస్లింలు అధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతం నుండి ఆరుమందిని పోటీకి నిలబెట్టింది. ఒకవేళ ఇంతకు ముందు జరిగిన నాలుగు దశల ఎన్నికలలో ఎన్డీయే, జనతా పరివార్ కూటములు స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగినన్ని సీట్లు సాధించలేకపోయినట్లయితే, ఈ ఐదవ దశలో పోటీ చేస్తున్న పార్టీలలో ఏది ఎక్కువ సీట్లు గెలిస్తే అది ‘కింగ్ మేకర్’ గా మారి బిహార్ రాజకీయాలలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. నవంబర్ 8వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. అంటే కేవలం మరో మూడు రోజుల్లో బీజేపీ, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ల భవిష్యత్ తెలిపోతుందన్న మాట. నేటితో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతాయి కనుక బిహార్ ఎన్నికల ఫలితాలపై సర్వేలు చేసిన మీడియా సంస్థలు ఈరోజు సాయంత్రమే తమ సర్వే ఫలితాలను ప్రకటించడం మొదలుపెట్టవచ్చును.