టీఆర్ఎస్ పార్టీలో తన కంటే ఎక్కువగా అవమానాల పాలయింది హరీష్ రావేనంటూ.. ఈటల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై హరీష్ రావు స్పందించడం లేదంటే నిజమేనని.. నిన్న ఉదయం ఈటల ప్రెస్‌మీట్ పూర్తయినప్పటి నుండి ప్రచారం జరిగింది. అయితే.. పార్టీ హైకమాండ్ నుంచి స్పందించాలని ఎలాంటి సందేశం రాకపోవడంతో హరీష్ సైలెంట్ అయిపోయారు. సోషల్ మీడియాలో కూడా.. ఈటల వ్యాఖ్యల టెంపో పెరిగిపోతూండటంతో వివరణ ఇవ్వాలని హరీష్‌కు హైకమాండ్ నుంచి సందేశం వచ్చింది. దాంతో.. హరీష్ రావు ప్రకటన విడుదల చేశారు.
పార్టీ నాయకుడిగా కేసీఆర్ ఏ ఆదేశం ఇచ్చినా నడుచుకుంటానని హరీష్ ప్రకటించారు. గతంలోనూ అదే చెప్పానన్నారు. ఇప్పుడూ అదే చెబుతున్నానన్నారు. ఈటల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. తాచెడ్డ కోతి.. వనమెల్లా చెరిచినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. పార్టీలో ఉండాలా.. వెళ్లిపోవాలా అనేది ఆయన ఇష్టమని.. సమస్యలకు, గొడవలకు నైతిక బలం కోసం పదే పదే తన పేరును ప్రస్తావించడం మంచిది కాదన్నారు. తన భుజాల మీద తుపాకి పెట్టాలనుకోవడం విఫలయత్నం అవుతుందన్నారు. తన గురించి ఈటల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని హరీష్ స్పష్టం చేశారు.
హరీష్ రావుకు తన కంటే ఎక్కువ ఇబ్బందులు కల్గించారని ఈటల గతంలోనూ అన్నారు. శుక్రవారం కూడా అన్నారు. వీటికి చెక్ పెట్టకపోతే.. మళ్లీ మళ్లీ హరీష్ గురించి చెబుతూనే ఉంటారని అనుకున్నారు. అందుకే.. హరీష్ స్పందించిన ప్రకటన రిలీజ్ చేసినట్లుగా భావిస్తున్నారు. అయితే టీఆర్ఎస్లో హరీష్ రావుకు ఎదురైన పరిస్థితులు అందరికీ తెలుసు. ఈ కారణంగా.. ఆయన తనకు అవమానాలు ఎదురవలేదని నేరుగా ప్రకటించినా.. చాలా మంది నమ్మరు. అందుకే ప్రకటన విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.