హైదరాబాద్: ఎట్టకేలకు హైదరాబాద్ మెట్రో రైల్‌కు మోక్షం కలుగుతోంది. తెలంగాణ రాష్ట్రావతరణ దినమైన జూన్ 2వ తేదీన 20 కిలోమీటర్ల మెట్రో ఫస్ట్ ఫేజ్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నామని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్‌లో చెప్పారు. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోడి అప్పాయింట్మెంట్ ఇంకా ఖరారు కాలేదని, అయిన వెంటనే అధికారికంగా తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఫస్ట్ ఫేజ్‌లో నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు వేసిన లైన్ గత ఏడాది ఉగాదికే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ నిర్మాణంలో ఆలస్యం వల్ల అది వాయిదాలు పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే.
మరోవైపు కేటీఆర్ ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికోసం 100 రోజుల ప్రణాళికను ప్రకటించారు. రు.30 కోట్లతో నాలాలను క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. మహిళా సంఘాలకు 100 రోజుల్లో రు.100 కోట్లను విడుదల చేస్తామని తెలిపారు. రు.26 కోట్లతో 40 మోడల్ మార్కెట్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. రు.10 కోట్లతో 10 శ్మశాన వాటికలు నిర్మిస్తామని తెలిపారు. రు.200 కోట్లతో 569 బీటీ రోడ్లను నిర్మిస్తామని చెప్పారు. 150 జిమ్ సెంటర్లు, 329 స్పోర్ట్స్ గ్రౌండ్స్‌ను నిర్మిస్తామని తెలిపారు. రు.5 కోట్లతో 100 పబ్లిక్ టాయిలెట్లను నిర్మిస్తామని చెప్పారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నామని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ విషయంలో దళారులను నమ్మొద్దని కేటీఆర్ అన్నారు.