ఓ వైపు అమ్మఒడి పేరుతో జగన్మోహన్ రెడ్డి మీట నొక్కి తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్న సమయంలోనే నిధుల కోసం.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో అధికారుల బృందంతో వాలిపోయారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో పాటు… మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ సమావేశం కానున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు రావడం.. అప్పులు పుట్టే మార్గాలన్నీ మూసుకుపోవడం.. చెల్లింపుల ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం… అత్యవసర నిధుల కోసం ప్రయత్నిస్తోంది. అదే సమయంలో… అమ్మఒడి కోసం దాదాపుగా ఆరు న్నర వేల కోట్లు పంపిణీచేయాల్సి ఉంది. అన్నీ ఒక్క సారే పంపిణీ చేసే పరిస్థితి లేదు. విడతల వారీగా.. నెలాఖరులోపు మొత్తం పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కారణంగా… నిధులను సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగానే… బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధికారుల బృందంతో ఢిల్లీకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. మరో వైపు..బడ్జెట్ కసరత్తు కూడా ఫుల్ స్వింగ్‌లో ఉంది. వచ్చే ఏడాది మరింత తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఏపీ ప్రభుత్వం ఎదుర్కొనుంది. బడ్జెట్లో మరింత మెరుగైన ప్యాకేజీ పొందకపోతే… ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయాలను కూడా… ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు బుగ్గన ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం చేసిన కొన్ని అప్పులను తిరిగి చెల్లించడం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అవి చెల్లించాలంటే.. మరింత ఆదాయ వనరు ఉండాల్సి ఉంది. అదే సమయంలో.., కోవిడ్ కారణంగా… ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని సవరించి ఎక్కువ రుణాలు తీసుకునే చాన్సిచ్చారు. వచ్చే ఏడాది ఆ చాన్స్ ఉంటుందో లేదో కూడా తెలియదు.
అదే జరిగితే రుణసామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ఈ కారణంగా బుగ్గన ముందు జాగ్రత్తగా..ఢిల్లీలో ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా తన పూర్తి సమయాన్ని నిధుల సమీకరణ కోసమే వచ్చిస్తున్నారు. ఎక్కువగా ఢిల్లీలోనే ఉండి… కేంద్ర సాయం కోసం ప్రయత్నిస్తున్నారు. కొసమెరుపేమిటంటే.. ఆయన ఎంతగా ప్రయత్నిస్తున్నా.. పోలవరానికి సంబంధించిన నిధులు.. ఎప్పుడో విడుదల చేస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించినా… ఇంత వరకూ విడుదల చేయలేదు.