ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసినా పేదవాడిని కారణంగా చూపించడం చాలా రోజుల కిందటే ప్రారంభించింది. చివరికి టిక్కెట్ రేట్లు పేదవాడికి అందుబాటులో ఉండొద్దా లాంటి డైలాగుల్ని.. సినీ టిక్కెట్ల రాజకీయాల కోసం వాడుకున్నారు. ఇప్పుడు ఆర్థిక అక్రమాల దగ్గరకు వచ్చే సరికి మళ్లీ పేదవాడిని పైకి తీసుకు వస్తోంది ఏపీ ప్రభుత్వం. కాగ్ అడుగుతున్న లెక్కలు చెప్పలేక.. ఆ అక్రమాలను ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలకు సమాధానం చెప్పలేక ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు అంతా పేదవాడి కోసం చేశామనే తెరపైకి తీసుకు వస్తున్నారు.
వచ్చే ఏడాది అప్పుల కోసం ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూ ఢిల్లీలోనే మకాం వేసిన ఆయన.. రూ. 48వేలకోట్ల గోల్మాల్పై వస్తున్న ఆరోపణల గురించి సమాధానం ఇచ్చుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టారు. పేదల కోసం అప్పులు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. పేదల కోసం అప్పులు చేసి పంచి పెడుతూంటే.. అక్రమాలని టీడీపీ నేతలు నిందలు వేస్తున్నారని ఆరోపించారు. బుగ్గన వాదన ఎవరికైనా విచిత్రంగా అనిపించడం ఖాయం. అప్పులు చేయడం మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆ అప్పుల డబ్బులను ఎలా ఖర్చు చేశారు… ఎవరికి చెల్లించారన్న లెక్కలేకపోవడమే ఇప్పుడు తెలియాల్సి ఉంది. వాటికి తాముకాగ్కు చెప్పామని.. మరొకటని వాదిస్తూ.. పేదవాడిని తెరపైకి తెస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం … ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నట్లుగా వ్యవహరించడం లేదు. సొంత వ్యాపార సంస్థను నడుపుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా చేస్తున్నారు. సొంత డబ్బును తరలించినట్లుగా తరలిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో చేస్తున్న తప్పుల్ని కాగ్ ప్రశ్నిస్తోంది కానీ కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా ఈ ఆర్థిక అరాచకత్వం పెరుగుతూనే పోతోంది. చివరికి ఏపీ ఆర్థిక వ్యవస్థ పతనమైనా.. దానికి పేదవాడినే కారణంగా చూపిస్తారేమో ..?