ప్రధాని నరేంద్ర మోడీ అదేపనిగా ప్రచారం చేసే మేకిన్ ఇండియా షోలో అగ్నిప్రమాదం దేశాన్ని కలవరపరిచింది. అగ్రనేతలు అభిమాన తారలూ సురక్షితంగా బతికి బయిటపడినందుకు వూపిరి పీల్చుకుంది. ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా భావించే దానిలో ఇంతటి ప్రమాదం జరగడం ఒక విదంగా సంచలనమే గాక మన సమర్థతపై మచ్చ వంటిది. ఏది ఏమైనా ప్రమాదాలను పూర్తిగా నివారించలేమని సరిపెట్టుకోవచ్చు. కాని దేశానికి ఆ అగ్ని ప్రమాదాన్ని మించిన ఆర్థిక ప్రమాదం ి పొంచి వుండటమే ఆందోళన కలిగిస్తుంది.మేకిన్ ఇండియా గురించి చెబుతూ ప్రధాని ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో వుంటే ఒక్క భారత దేశమే 7శాతం అభివృద్ది రేటుతో దూసుకుపోతుందన్నారు. కాని గణాంకాలు అనుభవాలు చెబుతున్నది వేరు. దేశంలో ఉత్పత్తిరంగం డిసెంబరు నెలలో 1.3 శాతం తగ్గుముఖం పట్టింది. ఇది అంతకు ముందు నెలలోని 3.4శాతం నుంచి తగ్గుదల! ఇందులో ముఖ్యంగా ఉక్కు ఉత్పత్తి 4.4శాతం పడిపోయింది. వ్యవసాయోత్పత్తి చాలాకాలంగా తిరోగమనంలోనే వుంది. ఇక ధరల విషయం చూస్తే టోకుధరల సూచి 2016 జనవరి నాటికి అంతకు ముందరి 17 నెలల కన్నా ఎక్కువగా 5.7శాతం పెరుగుదల చూపిస్తున్నది. ఆహార ధరల పెరుగుదల 6.9శాతం వుంది. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోలు ఉత్పత్తుల ధరలు పడిపోయినప్పటికీ మూడు సార్లు పన్నులు పెంచి 55,000 కోట్ల అదనపు మొత్తం వినియోగదారుల నుంచి లాగుతున్నారు ఏలినవారు. గతంలో ఎప్పుడూ అంతర్జాతీయ ధరల పెరుగుదల వల్ల దేశంలో పెరుగుదల వచ్చిందన్నవారు నిజానికి ఇప్పుడు పెట్రోలు రు.40 కి అటూ ఇటుగా అమ్మొచ్చు. కాని వినియోగదారులు చెల్లించే ధరలో 55 శాతం పన్నులకే పోతున్నందున తగ్గుదల లాంచనంగానే వుంది. ఇదే తరుణంలో కార్పొరేట్ వర్గాలకు మాత్రం 5.89 లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీలు ఇస్తున్నారు. వారికి ఇంకా ఇంకా రాయితీలు ఇచ్చేందుకు హడావుడి చేస్తూ మధ్యతరగతి వారికి మాత్రం గ్యాస్‌సబ్సిడీ వదులుకోవాలని దేశభక్తి ప్రబోధించడం ఎంత హాస్యాస్పదం?
2008లో అమెరికాలో మొదలై ప్రపంచాన్ని కుదిపేసిన ద్రవ్య సంక్షోభం భారత దేశాన్ని పెద్దగా ప్రభావితం చేయలేదంటే పటిష్టమైన మన ఆర్థిక సంస్థలే కారణం. కాని ఇటీవల వాటిని పూర్తిగా బలహీనపర్చారు. రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామరాజన్ వత్తిడిపై బయిటపెట్టిన బడాబాబుల బకాయిల ఎగవేత మొత్తం గత ఏడాది లక్షా 19 వేల కోట్లుగా వుంది. 39 లిస్టెడ్ బ్యాంకుల ఆదాయాలు ఈ దెబ్బకు హరించుకుపోయి పూర్తిగా నష్టాలలో కూరుకుపోనున్నాయి. వాటి నికరలాభాలు 98శాతం అదృశ్యమైనాయి. గత డిసెంబరుతో అంతమైన త్రైమాసానికి వాటిలో పేరుకుపోయిన మొండి బకాయిలను మొత్తంగా చూస్తే 4.38 లక్షల కోట్లు వున్నాయి. ఇందులోనూ అధిక భాగం ఎంతో ప్రచారం పొందిన ఇన్ఫ్రా కంపెనీలకే వెళ్లాయి. ఈ కారణంగా 12 బ్యాంకులకు లాభమనే మాట లేకుండా పోయింది. మొండి బకాయిలకు తగినంత మొత్తం అట్టిపెట్టాలని రిజర్వుబ్యాంకు ఇచ్చిన ఆదేశాలను అమలు జరిపినతర్వాత వాటి పరిస్థితి అతలాకుతలమైంది. తాత్కాలికంగా ఆందోళన కలిగించినా దీర్ఘకాలంలో దీనివల్ల మేలు జరుగుతుందని రఘురామరాజన్ చెబుతుంటే ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వచ్చే బడ్జెట్లో బ్యాంకింగు సంస్కరణలు ప్రవేశపెడతామంటున్నారు. రెండు నుంచి యాభై కోట్ల వరకూ వున్నవారెవరైనా ఇష్టానుసారం బ్యాంకులు తెరిచేందుకు అవకాశం కల్పించే ఈ కొత్త సంస్కరణలు ప్రజల ధనానికి కాస్తయినా రక్షణ లేకుండా చేయనున్నాయి.
అనేక కారణాలవల్ల చైనా అభివృద్ధి రేటు తగ్గినందువల్ల మనదేశం అత్యధిక అభివృద్ధి సాధించినట్టు చెప్పుకోవడం సాంకేతిక సంతోషం మినహాయిస్తే వాస్తవం కాదు. మొత్తంపైన గతంలో ట్రేడ్‌యూనియన్ల వామపక్షాల ఒత్తిడి కారణంగా వెనక్కు పోయిన బ్యాంకింగు సంస్కరణలు ఇప్పుడు దేశంపై రుద్దడంతో అమెరికా తరహా సంక్షోభం ముంచుకు వచ్చే ప్రమాదం పొంచివుంటుంది. అందులోనూ మన వంటి వర్ధమాన దేశానికి అది మరింత పెద్ద దెబ్బ అవుతుంది.