భారీ ప్రచారం, అంచనాల మధ్య ‘పెంగ్విన్’ అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. కీర్తి సురేష్ సినిమా కావడం, కొన్నాళ్లుగా సరైన సినిమా లేక ప్రేక్షకులు మొహం వాచి పోయి ఉండడంతో – ఈ సినిమా కోసం జనాలు ఆసక్తిగా ఎదురు చూశారు. తీరా చూస్తే.. `పెంగ్విన్` నిరాశ పరిచింది. నత్తనడక స్క్రీన్ ప్లే, పేలవమైన క్లైమాక్స్ తో `పెంగ్విన్` దారుణంగా డింకీ కొట్టింది. కాకపోతే.. అమేజాన్ ప్రైమ్‌లో నిన్నంతా పెంగ్విన్దే హవా. మూడు భాషల్లో తీసిన సినిమా కావడంతో వ్యూవర్ షిప్కి ఢోకా లేకుండా పోయింది.
ఈ సినిమాని ఎంతకి కొన్నారు? నిర్మాతల లాభమెంత? అనే విషయంపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ సినిమా దాదాపుగా 7.5 కోట్లకు అమేజాన్ సొంతం చేసుకున్నట్టు టాక్. వ్యూవర్ షిప్ ని బట్టి, ఆ తరవాత ఆదాయాన్ని షేర్ చేయడానికి అమేజాన్ ఒప్పుకుందట. ఇన్ని లక్షల గంటలకు ఇంత మొత్తం… అని ముందే అమేజాన్ `పెంగ్విన్` నిర్మాతతో ఒప్పందం చేసుకుందట. ఓటీటీ సంస్థల్లో వ్యూవర్ షిప్ ని గంటల్లో లెక్క గడతారు. ఎన్నిసార్లు చూశారు? ఎంతమంది చూశారు? అనేది కీలకం కాదు. కేవలం ఎన్ని గంటలు చూశారు? అనేదే లెక్క. అంటే.. ఈ సినిమాని జనాలు చూసేకొద్దీ నిర్మాతకు ఆదాయం పెరుగుతూ వెళ్తుందన్నమాట. ఈ లెక్కన `పెంగ్విన్` నిర్మాత గట్టెక్కేసినట్టే. ఈ సినిమా చూసినవాళ్లకెవరికైనా ‘లో బడ్జెట్ సినిమా’ అనే విషయం అర్థమైపోతుంటుంది. ఎందుకంటే కీర్తి తప్ప స్టార్ కాస్టింగ్ ఎవరూ లేరు. అతి తక్కువ లొకేషన్లలో సినిమాని నడిపించేశారు. ఈ లెక్కన నిర్మాతలు సేఫ్ అనుకోవొచ్చు.