జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తీవ్రంగా ఇబ్బంది పడుతున్న తెలుగుదేశం పార్టీ నేతల్లో జేసీ సోదరులు ముందు వరుసలో ఉంటారు. స్వతహాగా వారు కాంగ్రెస్ పార్టీ వాదులు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగారు. అయితే ఆయనతోనూ వారికి సన్నిహిత సంబంధాలు లేవు. మొదటి సారి కాంగ్రెస్ గెలిచినప్పుడు మంత్రి పదవి తెచ్చుకున్నా.. రెండో సారి ఆ అవకాశం దక్కలేదు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకపోవడంతో … చిరకాల ప్రత్యర్థి పరిటాల కుటుంబం టీడీపీలో ఉన్నప్పటికీ..వైసీపీ నుంచి ఆఫర్ ఉన్నప్పటికీ..వారు జగన్ వెంట నడవకుండా… టీడీపీలో చేరారు. అయితే.. జేసీ దివాకర్ రెడ్డి .. ఓపెన్ టాక్ ఆయనకు చిక్కులు తెచ్చి పెట్టింది.
జగన్మోహన్ రెడ్డిని కుల పరంగా మావాడు అంటూనే తీవ్రంగా విమర్శలు చేసేవారు. ఆ ప్రభావం ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కనిపిస్తోంది. జగన్ హిట్ లిస్ట్‌లో ఆయన మొదటగా ఉన్నారు. ఆయనను వైసీపీలో చేర్చుకోవడం కన్నా.. ఆయన ఆర్థిక మూలాలు దెబ్బతీస్తేనే.. శాంతిస్తామన్నట్లుగా వైసీపీ నేతలు చెలరేగిపోయారు. స్వాతంత్రం రాక ముందు నుంచి జేసీ కుటుంబానికి ఉన్న బస్సుల బిజినెస్ పూర్తిగా దెబ్బతినేలా రవాణాశాఖ అధికారులతో పని పూర్తి చేయించారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఎపిసోడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన బిజినెస్లన్నీ.. దెబ్బతిన్నాయి. ఇప్పుడు వారి కుటుంబానికి ఉన్న మైనింగ్ పై కూడా దృష్టి పడింది.
చివరికి మైనింగ్ ను కూడా.. లాక్కోవాలని చూస్తున్నారన్న ఆగ్రహంతో జేసీ దివాకర్ రెడ్డి.. మైనింగ్ ఆఫీసుపైకి అనుచరులతో వెళ్లారు. జేసీ బ్రదర్స్ అడుగేస్తే కేసు పెడుతున్నారు. ఈ క్రమంలోనూ కేసు పడింది. అలా అని ఆయన మైనింగ్ లైసెన్స్‌లను వదిలేసే అవకాశం కూడా లేదు. నోటీసులు కూడా వెళ్లిపోయాయి. అక్రమాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. అయితే.. మైనింగ్ అధికారులు టీడీపీ నేతల గనులన్నింటిలోనూ అక్రమాలు గుర్తించారు. కొంత మంది కోర్టులకు వెళ్లి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అయితే జేసీకి ఆ చాన్స్ ఉంటుందో ఉండదో కానీ.. ఆయన మాత్రం.. తమ కడుపు కొట్టి.. ఆకలితో చనిపోయేలా జగన్ చేస్తున్నాడని మండిపడుతున్నారు. వచ్చే వారం పది రోజుల్లో జేసీ మైన్స్ మొత్తాన్ని ప్రభుత్వం క్యాన్సిల్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే జేసీ చెప్పినట్లు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడటం ఖాయమంటున్నారు.