అర్జున్ సురవరం విజయంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు నిఖిల్. ఇప్పుడు తన దృష్టంతా కార్తికేయ 2 పైనే ఉంది. కార్తికేయ మంచి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచీ సీక్వెల్ తీయాలన్న ప్రయత్నాల్లో ఉన్నాడు నిఖిల్. ఎట్టకేలకు ఈమధ్యే ఈ సినిమా కొబ్బరికాయ కొట్టుకుంది. కాన్సెప్ట్ వీడియో సైతం విడుదల చేసి, ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించేశారు. అయితే ఆదిలోనే హంస పాదు అన్నట్టు ఈ సినిమాకి అప్పుడే కష్టాలు మొదలైపోయాయని టాక్.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమాకి బడ్జెట్ ఇబ్బందులు మొదలైనట్టు టాక్. చందూ మొండేటి ఇచ్చిన బడ్జెట్‌కీ, నిఖిల్ మార్కెట్ కీ పొంతన లేదని నిర్మాతలు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. బడ్జెట్ తగ్గించుకోమని చందూ మొండేటికి నిర్మాతలు సూచించారని సమాచారం. దాంతో పాటు కథలో అక్కడక్కడ కొన్ని జర్క్‌లు ఉన్నాయని, ఆ డౌట్లన్నీ క్లారిఫై అయ్యాక సినిమాని మొదలెడదామని చెప్పార్ట. స్క్రిప్టులో నిర్మాతలు కలగజేసుకోవడం, బడ్జెట్ తగ్గించమని అడగడం చందూని నచ్చలేదని తెలుస్తోంది. ఈ విషయమై దర్శక నిర్మాతల మధ్య చర్చలు వాడీవేడీగా సాగుతున్నాయని, ఒకవేళ ప్రస్తుతం ఉన్న నిర్మాతలు గనుక తప్పుకుంటే, ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రత్యామ్నాయంగా మరో నిర్మాతని చందూ ముందు జాగ్రత్తగా చూసుకున్నాడన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి.