తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకం రైతు బంధు. ఓ రకంగా టీఆర్ఎస్ రెండో సారి గెలవడానికి ఈ రైతు బంధు పథకమే కీలకం. ఎన్నికల సమయంలో.. పంపిణీ చేయడంతో.. వాటిని తీసుకున్న ఆనందంలో రైతులు టీఆర్ఎస్కు ఓట్లేశారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ పథకం అమలులో ఆలస్యం జరుగుతోంది. యాసంగి ప్రారంభమైన తర్వాత రెండు నెలలకు… రైతు బంధు సాయం అందిస్తున్న కేసీఆర్ సర్కార్… దాన్ని కూడా మొదట్లో పంపిణీ చేసినట్లుగా ఒకేసారి మీట నొక్కడం ద్వారానో.. చెక్కుల ద్వారానో.. పంపిణీ చేయడం లేదు. విడుతల వారీగా పంపిణీ చేస్తోంది.
రూ. ఏడున్నర వేల కోట్లను రైతు బంధు కోసం విడుదల చేశామని.. ఆదివారం సమీక్షలో కేసీఆర్ ప్రకటించారు. సోమవారం నుంచి విడుదల చేస్తామన్నారు. అంటే.. విడుదల చేస్తూ వెళ్తారన్నమాట. సోమవారం.. ఒక్క ఎకరం ఉన్న రైతులకు మాత్రమే.. రైతు బంధు సాయం కింద… ఒక్కొక్కరికి రూ. ఐదు వేలు జమ అయినట్లుగా తెలుస్తోంది. అదీ కూడా అందరికీ జమ కాలేదని.. ఇంకా కొంత మందికి పెండింగ్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. మంళవారం రెండు ఎకరాలు ఉన్న రైతులకు జమ చేస్తారని చెబుతున్నారు. ఇలా పెంచుకుంటూ… ఇచ్చుకుంటూ పోతారని అంటున్నారు.
ప్రభుత్వం రైతు బంధు సాయం చేయడమే ఆలస్యం అయితే… ఇలా పంపిణీలోనూ… వాయిదాల పద్దతి పాటించడం రైతుల్లో అసహనానికి కారణం అవుతుందని టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఏపీ సర్కార్.. అనేకానేక సంక్షేమ పథకాలను … జగన్మోహన్ రెడ్డి మీట నొక్కి విడుదల చేస్తూంటారు. అలా కేసీఆర్ కూడా ఒకే సారి లబ్దిదారుల అకౌంట్లలో నగదు జమ చేయాలని వారు కోరుకుంటున్నారు. కానీ.. ఆర్థిక కష్టాలతో.. ఎప్పటికప్పుడు నగదును సర్దుబాటు చేసుకుని.. రైతు బంధు నిధులు చెల్లిస్తున్నారని.. ఒకే సారి జమ చేయడం సాధ్యం కాదన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో నడుస్తోంది.