నాయకత్వ లేమి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైన సమస్యగా ఉందని తెలిసిందే. కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం ఎలాగూ ఉంటుంది కాబట్టి, కనీసం కొన్నాళ్లకైనా ఆ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. అయితే, కొత్త అధ్యక్షుడు వచ్చినంత మాత్రాన సరిపోదు కదా, సమర్థంగా పార్టీ కార్యకలాపాలు నిర్వహించాలంటే దానికి కావాల్సిన ఆర్థిక వనరులు కూడా పార్టీకి అవసరమే. కాంగ్రెస్ జాతీయ పార్టీ కదా, ఢిల్లీ నుంచి ఎంతో కొంత సాయం ఉంటుంది కదా అనుకోవచ్చు! కరెక్టే, కానీ వరుస రెండుసార్లు జాతీయ స్థాయిలో ఓటమిని చవిచూసింది కదా! పైనుంచి పెద్దగా ఆశించే పరిస్థితి ఇప్పుడు ఉండదు. కాబట్టి, రాష్ట్రస్థాయిలోనే పార్టీకి నిధుల సమీకరణ లాంటివి ఏవైనా జరగాలి, లేదంటే పార్టీ భవిష్యత్తుపై నమ్మకమున్న నాయకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సొంతంగా ఖర్చులైనా పెట్టడానికి మొగ్గు చూపాలి.
అలాంటి నాయకులు ఎవరనేది ప్రశ్న..? గత ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ మీద గెలిచినవారిలో కొంతమంది తెరాసలో చేరిపోయారు. ఇక ఓడిపోయినవారి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. ఇలాంటి సమయంలో ఆర్థికంగా పార్టీ కోసం ఏదైనా… అంటే, ఆమడదూరం వెళ్లిపోవడం అత్యంత సహజం! జిల్లా స్థాయిల్లో చూసుకుంటే ఇన్ ఛార్జుల కొరత కాంగ్రెస్ కి సమస్యగా ఉంది. ఇక, సీనియర్ల మధ్య ఐక్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్గత కుమ్ములాటలకు కేరాఫ్ టి. కాంగ్రెస్ అన్నట్టుగా ఉంది. పీసీసీ అధ్యక్షుడి రేసులో చాలామంది ఉన్నారు. తమకి పదవి దక్కించుకోవడం అనే ప్రయత్నం ఒకటైతే, ఎదుటివారికి దక్కకకూడదన్న ప్రయత్నమే ప్రధానంగా వారిలో కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలకు టి.కాంగ్రెస్ సిద్ధమౌతోంది. అయితే, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఆర్థిక అవసరాలు ఎలా తీరుతాయి..? పార్టీ నుంచి పోటీపడే అభ్యర్థులకు రాష్ట్ర స్థాయి నుంచి ఆర్థిక సాయం అందుతుందా, ఆ బాధ్యత డీసీసీల మీద నాయకత్వం పెట్టేస్తుందా అనేదీ సమస్యే.
తెరాసను ఎదుర్కొనే స్థాయిలో గడచిన ఐదేళ్లలో భారీ ఎత్తున కార్యక్రమాలకు చేపట్టడంలో టి. కాంగ్రెస్ విఫలమైంది. రెండోసారి ఓటమి తరువాత కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవాలంటే రాబోయే మూడేళ్లలో భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటిలానే, అన్నింటికీ కేవలం ప్రెస్ మీట్లకు పరిమితమౌతూ పోతే కష్టమే! ఇవన్నీ జరగాలంటే సరైన నాయకత్వంతోపాటు, ఆ నాయకత్వానికి ఆర్థిక వెలుసుబాటు కూడా ఉంటేనే సజావుగా సాగుతాయి. ప్రస్తుతానికైతే ఆర్థిక సమస్యలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిని తీర్చే నాయకులు, నాయకత్వం ఎవరో చూడాలి