జనం ఎప్పుడో మర్చిపోయిన ‘ఆరడుగుల బుల్లెట్’ మళ్లీ వార్తల్లో నిలిచింది. గోపీచంద్ – నయనతార జంటగా నటించిన సినిమా ఇది. బి.గోపాల్ దర్శకుడు. రెండేళ్ల క్రితం విడుదల కావాల్సిన ఈ సినిమాని, ఇప్పుడు కనీసం ఓటీటీలో అయినా తీసుకురావాలన్నది నిర్మాత ప్లాన్. అయితే… ఇది కూడా అంత ఆషామాషీ వ్యవహారంలా కనిపించడం లేదు. ఈ సినిమాపై ఇప్పటికే 20 కోట్ల వరకూ అప్పుంది. ఓటీటీ వాళ్లు మహా అయితే ఆరు నుంచి ఏడు కోట్ల వరకూ ఇవ్వొచ్చు. అంటే.. మిగిలిన నష్టమంతా నిర్మాతే భరించుకోవాలన్నమాట.
ఈ సినిమా వ్యవహారం కోర్టులో ఉంది. లావాదేవీలన్నీ కోర్టు పరిధిలోనే జరగాలి. ఈ సినిమాని ఎవరు కొనుక్కున్నా… కోర్టు ద్వారానే డబ్బు చెల్లించుకోవాలి. అప్పులన్నీ చెల్లించాక… మిగిలిన సొమ్ము మాత్రమే నిర్మాత చేతికొస్తాయి. రూ.20 కోట్ల అప్పుకి, ఏడు కోట్ల రాబడికీ ఏమైనా సంబంధం ఉందా? మరో విషయం ఏమిటంటే.. ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని ఏనాడో అమ్మేశారు. దాని ద్వారా ఏడు కోట్ల వరకూ ఆదాయం వస్తోంది. అయితే.. ఓటీటీకి సినిమా అమ్ముకుంటే, ఏ ఛానలూ అంత మొత్తంలో ఈ సినిమాని కొనదు. ఆ ఏడు కోట్లలో… మళ్లీ ఎంతో కొంత వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఏ రూపంలో చూసినా, ఆరడుగుల బుల్లెట్.. నిర్మాత కంటికి కునుకు లేకుండా చేస్తోంది. అప్పుల్ని ఎంతో కొంత క్లియర్ చేసుకుని, మిగిలిన సొమ్ము చేబులోంచి ఇవ్వడం మినహా నిర్మాత చేయగలిగిందేం లేదు కూడా.