లాక్డౌన్ కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే.. కొన్ని మినహాయింపులు ఇచ్చే విషయంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. మూడు వారాల లాక్ డౌన్‌తో దేశం ఆర్థికంగా కుంగిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా రెండు వారాలు కొనసాగిస్తే.. చాలా కాలం పాటు ప్రభావం ఉంటుందని నమ్ముతున్నారు. అందుకే కేంద్రం ద్విముఖ వ్యూహం అవలంభింంచాలని నిర్ణయించింది. ఇటు లాక్డౌన్ సడలిస్తూనే అటు కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు అనేక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. కేంద్రం అనేక మంది సలహాలను తీసుకుంది. కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో లాక్డౌన్ కొనసాగించి.. తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పాక్షికంగా సడలించాలని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. నిజానికి దేశంలో కేసులు తగ్గలేదు. రోజురోజుకు పెరుగుతున్నాయి కూడా.
పూర్తిగా తగ్గిన దేశాల్లో కూడా ఇప్పుడు రెండోసారి మళ్లీ దాడి చేస్తోంది కరోనా వైరస్. అందుకే అందరినీ ఒకేసారి రోడ్డు మీదికి రాకుండా కొన్ని నెలల పాటు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. లాక్డౌన్ ఎత్తివేసే విషయంలో ఏ మాత్రం అలసత్వం కనిపించినా.. మళ్లీ చెలరేగిపోయే ప్రమాదం ఉంటుంది. అదే జరిగితే.. మళ్లీ లాక్ డౌన్ లాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం.. మధ్యతరగతి జీవితాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ప్రభుత్వాలే ఉద్యోగుల జీతాలు తగ్గించడంతో.. ప్రైవేటు సంస్థలన్నీ అదే బాట పట్టాయి. జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాలు ఆదేశించినప్పటికీ.. వాటిని సీరియస్‌గా తీసుకునే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా.. మధ్య, సూక్ష్మ స్థాయి పరిశ్రమలకు.. ప్యాకేజీ ప్రకటిస్తామని ఆశ పెడుతోంది కానీ.. ఇంత వరకూ ఏమీ ప్రకటించలేదు. గత నెలకు సంబంధించి పని చేసిన కాలానికి కూడా.. చాలా సంస్థలు జీతాలు తగ్గించి ఇచ్చాయి.
లాక్ డౌన్ పిరియడ్‌లో అసలు పనే ఉండదు కాబట్టి.. జీతాలు ఇచ్చే సమస్యే ఉండదు. ఇక వ్యాపారులు, చిరు వ్యాపారుల లావాదేవీలు నిలిచిపోయాయి. రైతుల పంటలు కొనే దిక్కు లేదు. ఎలా చూసినా.. ఆర్థిక వ్యవస్థపై… ఇప్పటి వరకూ వేసిన లాక్ డౌన్ ప్రభావం ఏడాదిపాటు ఉంటుంది. ప్రజలు ఆర్థికంగా చితికిపోతే ఆ ప్రభావం.. ఖచ్చితంగా ఓట్ల మీద పడుతుంది.అందుకే ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోక తప్పడంలేదు.