విష్ణు విశాల్ కి తమిళంలో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. తను మంచి కథలు ఎంచుకుంటాడని అక్కడి ప్రేక్షకుల నమ్మకం. ఆ నమ్మకాన్ని చాలా వరకూ నిలబెట్టుకున్నాడు. తెలుగులో హిట్టయిన `రాక్షసుడు`… మాతృక `రాక్షసన్`లో తనే హీరో. ఈ ఒక్క సినిమా చాలు. విష్ణు విశాల్ టేస్ట్ ఏమిటో చెప్పడానికి. ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్టులు ఎంచుకునే విశాల్… నిర్మాతగా మారి ఓ సినిమా చేశాడు. అదే.. `ఎఫ్.ఐ.ఆర్`. ఈ సినిమా చూసి రవితేజ లాంటి హీరోనే పొంగిపోయాడు. తాను కూడా ఓ పార్టనర్‌గా మారాడు. ఈ సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విష్ణు విశాల్. మరి అన్ని ప్రత్యేకతలు.. ఈ `ఎఫ్.ఐ.ఆర్`లో ఏమున్నాయి?
ఇర్ఫాన్ (విష్ణు విశాల్) ఓ కెమికల్ ఇంజనీర్. మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. కానీ ఉద్యోగం దొరకదు. పార్ట్ టైమ్ లో భాగంగా ఓ కంపెనీలో పనిచేస్తుంటాడు. మరోవైపు… మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది అబు బకర్ అబ్దుల్లా కోసం ఇంటిలిజెన్స్ విభాగం గాలిస్తుంటుంది. అబూ బకర్ అనేవాడు ఒకడున్నాడని తెలుసు కానీ, ఎంత ప్రయత్నించినా అతని ఐడెంటెటీ మాత్రం తెలుసుకోలేకపోతుంది. అబూ బకర్.. దేశ వ్యాప్తంగా బాంబు బ్లాస్టింగులు ప్లాన్ చేశాడని, ఓ విధ్వంసానికి రెడీ అవుతున్నాడని తెలిసి ఇంటిలిజెన్స్ విభాగం ఎలెర్ట్ అవుతుంది. ఇర్ఫాన్ చేసిన కొన్ని పొరపాట్లు, యాదృచ్ఛిక ఘటనల వల్ల… అతనే అబూబకర్ అని ఇంటెలిజెన్స్ అనుమానిస్తుంది. అతన్ని అదుపులోకి తీసుకుంటుంది. ఇర్ఫాన్ అదుపులోకి వచ్చాక.. కొన్ని అనూహ్యమైన ఘటనలు జరుగుతాయి. అదేమిటి? అసలు ఇర్ఫాన్ పై ఇంటిలిజెన్స్‌కి ఎందుకు అనుమానం వచ్చింది? నిజంగా ఇర్ఫానే అబూబకరా? లేదంటే ఓ అమాయకుడిపై.. ఇంటిలిజెన్స్ తీవ్రవాది అనే ముద్ర వేసిందా?.. అన్నదే మిగిలిన కథ.
ముస్లిం అని తెలిస్తే చాలు. పోలీసు కళ్లు అనుమానిస్తాయి. ఇంటిలిజెన్స్ అయితే స్కాన్ చేసేస్తుంది. అలాంటిది.. ఓ ముస్లిం జీవితం కాస్త అనుమానించే విధంగా, గందరగోళంగా ఉంటే ఇంకేం అవుతుంది? అచ్చంగా ఇర్ఫాన్ కథ అదే. ఓ అమాయకుడిపై ఇంటిలిజెన్స్ తీవ్రవాది అనే ముద్ర వేయడం… ఇంటిలిజెన్స్ చేసిన తప్పు వల్ల… ఒకరి జీవితం బలి అవ్వడం.. కొన్ని సినిమాల్లో చూశాం. దాదాపుగా `ఎఫ్.ఐ.ఆర్` కథ కూడా అలాంటిదే. కాకపోతే.. కొత్త ట్విస్టులు, టర్న్ లు… ఈ `ఎఫ్.ఐ.ఆర్`ని మరో కోణంలో చూపించాయి.
ఈ కథ చాలా సాదా సీదాగా, నిదానంగా మొదలవుతుంది. ఇర్ఫాన్ జీవితం.. తన ఉద్యోగ ప్రయత్నాలు, అమ్మ ప్రేమ.. తనకో ఫ్లాష్ బ్యాక్.. ఇలా చూపించుకుంటూ వెళ్లాడు దర్శకుడు. ఇర్ఫాన్ ఎపిసోడ్లో ఎలాంటి కిక్.. ఉండదు. ఆ మాటకొస్తే చాలా బోరింగ్ గా కథ నడుస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మరోవైపు అబూబకర్ కోసం ఇంటిలిజెన్స్ ప్రయత్నాలు మొదలెడుతుంది. ఒక్కో లింకూ.. లింకూ పట్టుకుని.. అన్వేషిస్తుంటుంది. అటు ఇంటిలిజెన్స్ చేసే అన్వేషణ.. ఇటు ఇర్ఫాన్ కథ.. రెండూ ఒక లింకు కి చేరేటప్పటికి చాలా సమయం అయిపోతుంది. రీళ్లు వృథాగా తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంత సాధారణమైన కథని విష్ణు విశాల్ ఎలా ఒప్పుకున్నాడు? అనే అనుమానం వేస్తుంది. ఎయిర్ పోర్టులో.. ఇర్ఫాన్ ఫోను పోగొట్టుకున్న దగ్గర్నుంచి కథ పరుగు అందుకుంటుంది. ఇంట్రవెల్ ముందు సీన్లన్నీ పకడ్బందీగా తీశాడు దర్శకుడు.
అయితే మళ్లీ సెకండాఫ్ కూడా అంతే నిదానంగా, నీరసంగా మొదలవుతుంది. దర్శకుడు పట్టు తప్పేశాడా? అనిపిస్తుంది. కానీ.. మళ్లీ తేరుకున్నాడు. కొన్ని సందర్భాల్లో ఇర్ఫాన్ అమాయకుడు అనిపిస్తుంది. ఇంకొన్ని చోట్ల… నిజంగా తీవ్రవాదేనా? అనే అనుమానం వేస్తుంది. ఈ గందరగోళం తెరపై మిగిలిన పాత్రలకే కాదు.. ప్రేక్షకుడికీ కలుగుతుంది. పోలీసుల చెర నుంచి.. ఇర్ఫాన్ పారిపోవడం దగ్గర్నుంచి కథ జెట్ స్పీడులో పరుగెడుతుంది. ఆ తరవాత.. ఒక్కొక్క ముడినీ విప్పుకుంటూ వచ్చాడు దర్శకుడు. క్లైమాక్స్‌కి ముందొచ్చే `ప్లాన్ బి` ట్విస్టు ఈ కథకు ప్రాణం. `ఓహో.. ఇందుకా.. ఫస్టాఫ్ అలా నడిపించాడు` అనిపిస్తాడు దర్శకుడు. ఈ ట్విస్టు నచ్చే… విశాల్ ఈ కథని ఓకే చేసి ఉంటాడు. ఆ ట్విస్టు రివీల్ చేసిన పద్ధతి, సందర్భం.. నచ్చుతాయి. అక్కడ్నుంచి క్లైమాక్స్ చాలా గ్రిప్పింగ్ గా సాగుతుంది. అయితే… దర్శకుడు ట్విస్టు కోసం కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నాడనిపిస్తుంది. అవన్నీ ఇప్పుడు చెబితే.. కథ స్పాయిల్ అయిపోతుంది. మొత్తానికి సాదా సీదాగా మొదలైన ఓ కథ అసాధారణ రీతిలో.. ముగుస్తుంది. సినిమా అంతా ఎలా ఉన్నా.. క్లైమాక్స్ మాత్రం అందరినీ సంతృప్తి పరుస్తుంది.
విష్ణు విశాల్ గొప్ప నటుడు అని చెప్పలేం గానీ, డీసెంట్ యాక్టర్. ఆ డీసెన్సీ.. ఈ పాత్రలోనూ కనిపించింది. పోస్టర్లో రెండు ముఖాలతో ఉన్న విష్ణు విశాల్ ని చూస్తాం. ఈ పాత్రలోనూ తనకు రెండు ముఖాలుంటాయి. అవేంటన్నది ట్విస్టు. గౌతమ్ మీనన్ వల్ల.. ఆ పాత్రకు హుందాతనం వచ్చింది. కాకపోతే.. ఆ గొంతే కాస్త డిస్ట్రబ్ చేస్తుంటుంది. డబ్బింగ్ కొత్తగా ఉంటుందని ట్రై చేసి ఉంటారు. మంజుమా మోహన్‌ది చిన్న పాత్రే. ఆ పాత్రకంటూ పెద్దగా ప్రాధాన్యం లేదు.
కెమెరా పనితనం, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ మరింత గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. ముఖ్యంగా.. ఫస్టాఫ్ లో. హ్యాకర్‌కి సంబంధించిన సన్నివేశాలు ట్రిమ్ చేయాల్సింది. నిజానికి వెబ్ సిరీస్ కి సరిపడేంత కంటెంట్ ఈ కథలో ఉంది. ఆ ఫార్మెట్ కి అయితే.. ఎఫ్.ఐ.ఆర్ మరింత బాగుండేది. కాస్త ఓపిక ఉండి, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టు కోసం కాసేపు కాచుకు కూర్చోవచ్చు అనుకునేవాళ్లు కచ్చితంగా `ఎఫ్.ఐ.ఆర్` ట్రై చేయొచ్చు.