అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా తయారీకేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిదిమంది మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు సమయంలో పరిశ్రమలో 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
బాణసంచా తయారీకేంద్రంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది , పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.
బాధితులు ఎక్కువమంది తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందినవారు ఎక్కువమంది ఉన్నారని సమాచారం. వీరంతా బాణసంచా తయారీ కేంద్రంలో కూలీ పని కోసం వచ్చారు. తారాజువ్వల తయారీకి సంబంధించిన ఫ్యాక్టరీలో బాణసంచా తయారీ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరీ నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
మరోవైపు మం కోటవురట్ల మండలంలో విషాదంపై సీఎం చంద్రాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై వివరాలను హోంమంత్రి అనిత, కలెక్టర్ విజయకృష్ణన్ , ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.