కడప జిల్లా పులివెందుల సమీపంలో ఉన్న తుమ్మలపల్లి యురేనియం ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్‌లో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. కంట్రోల్ చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు . యూరేనియం అనేది అత్యంత సున్నితమైన.. ప్రమాదకరమైనది కావడంతో… చుట్టుపక్కల గ్రామల ప్రజలందరూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే అ ప్లాంట్ చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున కాలుష్యం విడుదల చేస్తుందన్న కారణంగా.. ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఆ ప్లాంట్ విడుదల చేస్తున్న వ్యర్థాల వల్ల కొన్ని వందల ఎకరాల్లో పంటలు పండటం లేదు. అదే సమయంలో.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రోగాల పాలవుతున్నారు. ఈ పరిశ్రమ వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం… నిబంధనలు పాటించకపోవడం వల్ల అనేక సార్లు విమర్శల పాలయింది.
యురేనియం ప్రభావం ఆరోగ్యంపై తీవ్రంగా ఉంటుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. అగ్నిప్రమాదంలో యూరేనియం ఏమైనా గాల్లో కలిస్తే.. తీవ్రమైన సమస్యలు ఉంటాయని భయపడుతున్నారు. తుమ్మలపల్లె వద్ద 2008లో యూసీఐఎల్ యురేనియం శుద్ధికర్మాగారాన్ని నిర్మించింది. అది కేంద్ర ప్రభుత్వానికి చెందినదే. అప్పట్లో.. దేశంలో ఏ రాష్ట్రం కూడా.. ఈ యూరేనియం పరిశ్రమ తమ రాష్ట్రంలో పెట్టడానికి అంగీకరించలేదు. అప్పుడు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. కాంగ్రెస్ హైకమాండ్‌కు భరోసా ఇచ్చిపులివెందులకు పరిశ్రమను తీసుకొచ్చారు. రోజుకు ప్రస్తుతం ఉన్న శుద్ధికర్మాగారం 3250 టన్నుల ముడి యురేనియాన్ని శుద్ధి చేస్తోంది. ఇటీవల రెండో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు.
ఇటీవలి కాలంలో యూరేనియం గనుల కోసం .. తవ్వకాలు కూడా ప్రారంభించారు. నల్లమల తీరంలోని రుద్రవరం, ఆళ్లగడ్డ, నంద్యాల, మహానంది మండలాల్లో సర్వే చేశారు. తవ్వకాలు కూడా ప్రారంభించారు. అప్పట్లో భూమా అఖిలప్రియ.. అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి.. తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. ఆ తర్వాత తవ్వకాలు ఆగిపోయాయి. ఈ ప్రమాదం కారణంగా ఇప్పుడు మళ్లీ యూరేనియం పరిశ్రమ వార్తల్లోకి వస్తోంది.