హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్‌లో సంధ్య, సుదర్శన్ థియేటర్లు ఎంత పాపులరో.. విశాఖలోని గాజువాలో గల కన్య, శ్రీకన్య థియేటర్లు అంత పాపులర్. రెండూ ఒకే బిల్డింగులో వుంటాయి. పేరుకు సింగిల్ స్క్రీన్ థియేటర్లు. కాని మల్టీప్లెక్స్‌లకు ఏమాత్రం తీసిపోని రీతిలో వుంటుందని విశాఖపట్టణ వాసులు చెబుతుంటారు. సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరగడంతో థియేటర్లు పూర్తిగా కాలిపోయాయి. బూడిద మాత్రమే మిగిలింది. ఉదయమే థియేటర్‌కి వచ్చిన సిబ్బంది పొగలు రావడం గమనించి యజమానికి సమాచారం అందించారు. ఆయన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. థియేటర్ల దగ్గరకు ఫైరింజన్లు చేరుకునే సరికే థియేటర్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. ఎనిమిది ఫైరింజన్ల సాయంతో కొన్ని గంటలపాటు ప్రయత్నించిన తరవాత మంటలు అదుపులోకి వచ్చాయి.
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కొన్నాళ్ల కిందట ఈ రెండు థియేటర్లను రీ మోడలింగ్ చేశారని తెలుస్తుంది. ఆయనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో థియేటర్లు వున్నాయి. వాటిలో కొన్ని లీజుకు తీసుకున్నవి, మరికొన్ని సొంతవి. కన్య, శ్రీకన్య థియేటర్లను దిల్‌రాజు లీజుకు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన లీజులో వున్నాయో… లేదో… తెలియాల్సి వుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు మూడు కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు.