ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆఫీసులో అగ్నిప్రమాదం సంభవించింది. లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళ్తే చెన్నైలోని అభిరాంపురం అనే ప్రాంతంలో మణిరత్నం ఆఫీస్ ఉంది. తన సినిమాలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలనీ అక్కడి నుంచే నిర్వహిస్తారు మణి. ఈరోజు తెల్లవారుఝామున ఆ ఆఫీసులో అగ్ని ప్రమాదం సంభవించింది. లోపలున్న విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ సమయంలో మణి ఆపీసులో లేరు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం సంభవించిందని ప్రాధమిక నివేదికలో తేలినట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రాణ నష్టం జరగలేదు. ఎవరికీ గాయాలూ అవ్వలేదు. దాంతో మణిరత్నం ఊపిరి పీల్చుకొన్నారు. ప్రస్తుతం మణిరత్నం కార్తితో ఓ సినిమా తీస్తున్నారు. కొంతభాగం చిత్రీకరణ పూర్తయ్యింది కూడా.