తెలంగాణలో తొలి కరోనా మరణం చోటు చేసుకుంది. అయితే.. మరణించిన తర్వాత మాత్రమే మృతునికి కరోనా ఉందని తేలింది. ఆయనకు విదేశీ ట్రావెల్ హిస్టరీ లేదు. కానీ.. ఢిల్లీలో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో.. ఈ నెల పధ్నాలుగో తేదీన పాల్గొన్నారు. పదిహేడో తేదీన తిరిగి వచ్చారు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గుర్యయారు. ఆయనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. కరోనా లక్షణాలు ఉండటంతో.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి.. నమూనాలు తీసుకుని పరీక్షలు నిర్వహించారు. కరోనా పాజిటివ్ అని తేలింది. ఢిల్లీలో ఇదే మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న ఇతర వ్యక్తులకు కూడా కరోనా వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు.
గుంటూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి సమీప బంధువు కూడా.. ఢిల్లీలో మతపరమైన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వచ్చిన తర్వాతే కరోనా పాజిటివ్‌గా తేలిదంది. శుక్రవారంతో పోలిస్తే.. తెలంగాణలో శనివారం.. కాస్త తక్కువ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఆరు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య ఆరవై ఐదుగా తేలింది. ఇవన్నీ కాంటాక్ట్ కేసులు కావడంతో.. ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేసేది. కరోనా విజృంభణ తర్వాత వైద్య ఆరోగ్య శాఖకు చెందిన వారికి స్క్రీనింగ్ కోసం ఎయిర్‌పోర్టులో నియమించారు. అలా నియమించిన సిబ్బందిలో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది.
మొత్తం అరవై ఐదు మంది లో ఇప్పటికే పది మందికి చికిత్స తర్వాత నెగెటివ్ వచ్చింది. మరో మూడు రోజులు అబ్జర్వేషన్లో ఉంచి..మరోసారి టెస్టు చేసి..నెగెటివ్ వస్తే.. వారిని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. ప్రాణాపాయంలో ఎవరూ లేకపోయినా.. ఒక్కరి పరిస్థితి మాత్రం ఆందోళన కరంగా ఉందని మంత్రి ఈటల చెబుతున్నారు. క్వారంటైన్లో ఉన్న వారిపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రత్యేక యాప్ ద్వారా వివరాలు సేకరిస్తోంది. వారు ఇంటి నుంచి బయటకు వెళ్లినా.. వారి ఆరోగ్యం సరిగ్గాలేదని.. సమాచారం వచ్చినా ప్రత్యేక బృందాలు వారి ఇళ్ల దగ్గరకు వెళ్లిపోయే ఏర్పాట్లు చేశారు.