పవన్ కల్యాణ్ రిఫరెన్సులు సినిమాల్లో చూడడం చాలా సాధారణమైపోయింది. పవన్ డైలాగో, పాటో, మేనరిజమో చూపించి… ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంటారు స్టార్లు. అయితే ఇప్పుడో సినిమా ఏకంగా పవన్ కల్యాణ్ సినిమా చుట్టూనే తిరగబోతోంది. `ఖుషి` సినిమా ఫస్ట్ డే – ఫస్ట్ షో చూడ్డానికి ఓ అబ్బాయి పడే పాట్ల సమాహారంతో ఏకంగా ఓ కథే నడిపేశాడు. అదే.. `ఫస్ట్ డే – ఫస్ట్ షో`.
తెలుగు చిత్రసీమకి ఎన్నో అద్భుతాలు అందించిన సంస్థ.. పూర్ణోదయ క్రియేషన్స్. ఇప్పుడు ఆ సంస్థ నుంచి… `శ్రీజ ఎంటర్టైన్మెంట్స్` పుట్టుకొచ్చింది. తొలి సినిమాగా `ఫస్ట్ డే – ఫస్ట్ షో` చిత్రాన్ని రూపొందించారు. `జాతిరత్నాలు` ఫేమ్ అనుదీప్ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు జంటగా నటించారు. వంశీధర్ – లక్ష్మీ నారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్ త్రివిక్రమ్ చేతుల మీదుగా ఈ రోజు విడుదలైంది.
ఖుషి విడుదల రోజు చుట్టూ తిరిగే కథ ఇది. ఆ సినిమా ఫస్ట్ డే – ఫస్ట్ షో చూడాలని హీరోయిన్ ఆశ పడుతుంది. ఆ టికెట్ల కోసం, హీరో ఎంత కష్టపడ్డాడన్నదే ఇతివృత్తం. కథ సింపుల్ గా ఉన్నా… పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ని నచ్చే విషయాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. టీజర్ లో అదే కనిపిస్తోంది. ప్రతీ చోటా.. ఖుషీ రిఫరెన్సే. ఫన్ని కూడా బాగా మిక్స్ చేశాడు దర్శకుడు. మొత్తానికి.. చూడాల్సిందే అనే ఫీలింగ్ ని టీజర్ తో తీసుకొచ్చారు. ఇక సినిమా ఎలా ఉంటుందో…?