స్థానిక ఎన్నికల విషయంలో యాభై శాతం రిజర్వేషన్లకే హైకోర్టు మొగ్గు చూపడంలో ప్రభుత్వం ఇరకాటంలో పడిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ముందు… అనేక రకాల సవాళ్లు ఉన్నాయి. మార్చి 31లోపు బడ్జెట్ పెట్టి ఆమోదించుకోవాల్సి ఉంది. అదే సమయంలో.. మార్చి 31లోపు స్థానిక ఎన్నికలు కూడా పూర్తి చేయాల్సి ఉంది. లేకపోతే..రూ. ఐదు వేల కోట్ల నిధులు మురిగిపోతాయి. ఇప్పుడు అసెంబ్లీ, స్థానిక ఎన్నికలు రెండూ నిర్వహించాలంటే సాధ్యం కాదు. అధికారయంత్రాంగం మొత్తం స్థానిక ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. అదే సమయంలో..బడ్జెట్ మరో పెద్ద సమస్య బడ్జెట్ ఆమోదం పొందకపోతే…ప్రభుత్వానికి రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉండదు.
ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న ప్రభుత్వం… బడ్జెట్‌ను పక్కన పెట్టే ఆలోచన చేస్తోంది. తాత్కాలికంగా… మూడు నెలల కోసం.. ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా చూసుకుని.. మూడు నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాలనే ఆలోచన చేస్తోంది. ఈ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిపోతాయని… ఆ తర్వాత వాస్తవ బడ్జెట్ ప్రవేశ పెట్టినా… కొన్ని రంగాలకు నిధుల కేటాయింపులు తగ్గించినా… పోయేదేమీ ఉండదన్న అభిప్రాయానికి ప్రభుత్వ పెద్దలు వచ్చినట్లుగా చెబుతున్నారు. సాధారణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు.. రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సందర్భాల్లోనే ప్రవేశ పెడతాయి. ఈ అత్యవసర సందర్భాలు… ఎప్పుడంటే.. ఏదైనా ఆర్థిక సంవత్సరం మధ్యలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటేనే.. మూడు నెలలకు సరిపడా బడ్జెట్ ప్రవేశపెడతారు.
గత ఏడాది టీడీపీ సర్కార్ కూడా.. ఓటాన్ అకౌంట్ బడ్జెటే ప్రవేశపెట్టింది. మూడు నెలల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ… పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టి అసెంబ్లీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. లేకపోతే.. అప్పుడు కూడా మరోసారి మూడు నెలల పొడిగింపుకు ఆమోదం పొందొచ్చు. ఇప్పుడు… కూడా ప్రభుత్వానికి ఎన్నికల సాకు దొరకింది. అవి స్థానిక ఎన్నికలే కావడంతో.. ఆ ఆప్షన్ ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సర్కార్‌కు.. బడ్జెట్ కేటాయింపులు చేయడం.. తలకు మించిన భారంగా మారింది. లోటు అమాంతం పెరిగిపోవడంతో.. కవర్ చేసుకోవడం కష్టంగా మారింది. దీంతో.. ఓటాన్ అకౌంట్ పెడితేనే.. మంచిదన్న భావనకు ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తోంది.