రాజధానిపై ఏం జరుగుతుందోనని.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చర్చించుకుంటున్న సమయంలో.. పారిశ్రామిక ఉత్పత్తి పరంగా.. ఏపీ మరో అడుగు ముందుకేసింది. హీరో ప్లాంట్ నుంచి తొలి బైక్ బయటకు వచ్చింది. చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో ఈ ప్లాంట్‌ను హీరో సంస్థ నెలకొల్పింది. ఈ ప్లాంట్‌కు 2018 మార్చి 23న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. శంకుస్థాపన సమయంలోనే 2019 డిసెంబర్ కల్లా.. తొలి బైక్ ఉత్పత్తి చేస్తామని సంస్థ ప్రకటించింది. దానికి తగ్గట్లుగానే ఉత్పత్తి ప్రారంభించింది. 92 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. పదహారు వందల కోట్ల పెట్టుబడి పెట్టారు.
రాయలసీమను ఆటోమోబైల్ తయారీ రంగానికి కేంద్రంగా మార్చాలనుకున్న గత ప్రభుత్వం.. హీరో ప్లాంట్‌ను ఏపీకి తీసుకు రావడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేసింది. దక్షిణాదిలో ఓ ప్లాంట్ పెట్టాలనుకున్న హీరో.. మొదట ఏపీని పరిగణనలోకి తీసుకోలేదు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపింది. తెలంగాణతో దాదాపుగా ఒప్పందం కూడా చేసుకున్నారు. అయితే చంద్రబాబు.. నేరుగా.. హీరో మోటార్స్ చైర్మన్ తో విందు భేటీ నిర్వహించి.. ఏపీలో ఉన్న మెరుగైన వసతుల గురించి వివరించారు. ప్రభుత్వ సహకారం ఇస్తామని హామీ ఇచ్చారు. దాంతో.. ప్లాంట్ ఏపీలో పెట్టేందుకు అంగీకరించారు.
ఆ ప్రయత్నాలు ఫలించి..ఇప్పుడు ఉత్పత్తిన హీరో ప్లాంట్ ప్రారంభించింది. సహజంగా.. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. కానీ హీరో ప్లాంట్ పై.. ఏపీ సర్కార్ శీతకన్ను వేసింది. ఎక్కువగా ప్రచారం లభిస్తే… ఆ క్రెడిట్ గత ప్రభుత్వానికి వస్తుందని అనుకున్నారేమో.. కానీ అందరూ లైట్ తీసుకున్నారు. హీరో సంస్థ కూడా.. ప్రచారం చేయలేదు. కియా విషయంలో జరిగిన ప్రచారం.. హీరో ప్లాంట్ కు రాకూడదని.. ఏపీ సర్కార్ భావించినట్లుగా తెలుస్తోంది.