మహానటి అనే పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. సావిత్రి జీవిత కథ ఇది. ఎవడే సుబ్రమణ్యంతో దర్శకుడిగా నిరూపించుకొన్న నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకుడు. అశ్వనీదత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే.. సెట్స్‌పైకి తీసుకెళ్తారు. ఈ సినిమా కోసం సమంత, కీర్తి సురేష్లను కథానాయికలుగా ఎంచుకొన్నారు. ఇద్దరికీ సావిత్రి పాత్ర కోసం మేకప్ టెస్ట్‌లు కూడా నిర్వహించారు. అయితే.. సావిత్రిగా ఎవరు కనిపిస్తారన్నది మాత్రం ఇంకా చిత్రబృందం స్పష్టం చేయలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… కీర్తి సురేషే సావిత్రి అని, సమంత ఓ జర్నలిస్టు పాత్రని పోషిస్తోందని తెలుస్తోంది. తొలి రోజుల్లో సావిత్రి ఎలా ఉండేదో.. ఇప్పడు కీర్తి సురేష్ అలా ఉందని.. అందుకే కీర్తిని ఆ పాత్ర కోసం తీసుకొన్నామని చిత్రబృందం చెబుతోందట.
అయితే… ‘మాయాబజార్’ లాంటి చిత్రాల్లో సావిత్రి బొద్దుగా కనిపిస్తుంది. ఘటోద్కచుడు పూనినప్పుడు సావిత్రి నటన చూడాల్సిందే. మరి… ఆ ఎపిసోడ్ ఈ మహానటి సినిమాలో ఉంటే మాత్రం… ఆ సన్నివేశంలో కీర్తి సురేష్ తేలిపోతుందేమో అన్న భయం వేస్తోంది. అయితే.. ఎక్కువ భాగం సన్నివేశాలు సావిత్రి యంగ్ ఏజ్‌లో ఉన్నవే అని… కొన్ని సన్నివేశాల కోసం కీర్తి సురేష్ కాస్త బరువు పెరుగుతుందని తెలుస్తోంది. సమంత పాత్రనీ తక్కువ అంచనా వేయడానికి లేదని, అసలు ఈ కథకి మూలం.. సమంత క్యారెక్టరే అని తెలుస్తోంది. మహానటి పేరుతో ఓ పోస్టర్ని చిత్రబృందం డిజైన్ చేసి, ఇప్పుడు బయటకు వదిలింది. ఆ పోస్టర్ చూస్తే మాత్రం అటు కీర్తి, ఇటు సమంత… మధ్యలో సావిత్రి కనిపిస్తూ… అదరగొట్టేస్తుంది. సినిమా కూడా ఇలా ఉంటే.. సూపర్ హిట్టే ఇక.