ఎవరేమనుకున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పండగ సీజన్లో వస్తున్న పెద్ద సినిమాల కలెక్షన్లకు గండి పెట్టాలనే నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. టిక్కెట్ ధరలపై కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశం కమిటీ నియమించి… కాలయాపన చేయబోమని చెప్పింది. కానీ తొలి సమావేశంలో మ..మ అనిపించి.., తాత్కాలికంగా అయినా ఎంతో కొంత చార్జీలను పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ధియేటర్ యజమానుల మాటలను లైట్ తీసుకుంది. దీంతో జనవరి ఏడో తేదీన విడుదల కానున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా టిక్కెట్ రేట్లను అతి తక్కువగానే ఉండనున్నాయి.
హైకోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ ధరలను ఖరారు చేసేందుకు నియమించిన కమిటీ తొలి సమావేశంలో పెద్దగా చర్చ జరగకుండానే వాయిదా పడింది. ఈ సమావేశంలో ధియేటర్ యజమానులు తమ బాధలన్నీ చెప్పుకున్నారు. టిక్కెట్ రేట్లు అంత తక్కువకు ఉంటే నడపలేమన్నారు. కరెంట్ బిల్లులు, జీఎస్టీ ఛార్జీలు, నిర్వహణ ఖర్చులు భరించలేమన్నారు. అయినా సరే ప్రభుత్వ ప్రతినిధులు ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు.. మరో వారం రోజుల్లో మరోసారి సమావేశం నిర్వహిస్తామని.. అప్పుడు సమావేశానికి పూర్తి ప్రతిపాదనలతో రావాలని అధికారులు సూచించి సమావేశాన్ని ముగించారు.
ఖచ్చితమైన డేట్ చెప్పలేదు. వారం తర్వాత అన్నారు కానీ… ఎలాగూ సంక్రాంతి సెలవులు వస్తాయి. ఆ తర్వాత కమిటీ మరో భేటీ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చస్తే ఆర్.ఆర్.ఆర్కు ఏపీలో పాత టిక్కెట్ ధరలే అమలు కానున్నాయి. కానీ అది అధికారికమే. ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నధియేటర్ల యజమానులు మాత్రం బ్లాక్లో అమ్ముకుని సొమ్ము చేసుకోనున్నారు. ఇప్పటికే ఇది ప్రారంభమైంది.