గత రెండేళ్లుగా తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకి పోయే వాళ్ళే తప్ప పార్టీలో చేరేవాళ్ళు కనబడటం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఏర్పడిన ఆ అప్రపద తొలగిస్తూ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే గోనె ప్రకాశ రావు మళ్ళీ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తాజా సమాచారం. ఆయన ‘కాకా’ (జి.వెంకటస్వామి) కుమారులతో ఇబ్బందులు ఎదురవడంతో మూడేళ్ళ క్రితం కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఏ పార్టీలోను చేరకుండా రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. వారిద్దరూ తెరాసలోకి వెళ్లిపోయారు కనుక ప్రకాశరావు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రత్యర్ధులను బలంగా ఎదుర్కొని పోరాడగల వ్యక్తిగా ఆయనకి పార్టీలో మంచి గుర్తింపు ఉంది. కనుక ఆయనని పార్టీలోకి రప్పించేందుకు జానారెడ్డి తదితరులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశరావు అమెరికాలో ఉన్నారు. త్వరలోనే హైదరాబాద్ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని తెలుస్తోంది. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంకుశ పోకడలు, పాలన చూసిన తరువాత మౌనంగా ఉండటం భావ్యం కాదనే ఉద్దేశ్యంతోనే ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెపుతున్నారు. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతూనే తెలంగాణా ప్రభుత్వం దాని ముఖ్యమంత్రి కెసిఆర్ పై అస్త్రశస్త్రాలు సందించబోతున్నారని స్పష్టం అవుతోంది. అపార రాజకీయ అనుభవం, తెలంగాణా సమస్యల పట్ల మంచి అవగాహన ఉన్న ఆయన మాట్లాడటం మొదలుపెడితే, ఆయనని నిలువరించడానికి తెరాస కొంచెం చెమటోడ్చక తప్పదేమో!