ఇవ్వాళ్ళ పశ్చిమ బెంగాల్ మరియు అసోం రాష్ట్రాలలో మొదటి దశ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 18, అసోంలో 65 నియోజక వర్గాలలో నేడు ఎన్నికలు జరుగబోతున్నాయి. పశ్చిమ బెంగాల్ నేడు ఎన్నికలు జరుగబోతున్న నియోకవర్గాలలో 13 నియోజకవర్గాలు నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో ఉన్నాయి కనుక అక్కడ పోలింగ్ సాయంత్రం 4 గంటలకే పూర్తవుతుంది. మిగిలిన ఐదు జిల్లాలలో మాత్రం మాత్రం సాయంత్రం 6 గంటల వరకు సాగుతుంది. ఈ 18 సీట్లకు మొత్తం 133 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. అయితే పోటీ ప్రధానంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరియు వామపక్ష కూటమికి మధ్యే ఉంటుంది. ఈ ఎన్నికలలో ఎలాగయినా గెలవాలని పట్టుదలగా ఉన్న వామపక్షాలు అందుకోసం తాము తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీతో జత కట్టడం విశేషం. అయితే సర్వే నివేదికలన్నీ మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంటున్నాయి. కానీ కాంగ్రెస్-వామపక్షాలు జత కట్టడం వలన ఈసారి ఎన్నికలలో వాటి సీట్ల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని పేర్కొంటున్నాయి.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు మొత్తం ఆరు దశలలో జరుగుతాయి. మళ్ళీ రెండవ దశ ఎన్నికలు ఈనెల ఏప్రిల్ 17న జరుగుతాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నక్సల్ సమస్య అధికంగా ఉన్నందున ఆరు దశలలో ఎన్నికలు నిర్వహించవలసి వస్తోంది. ఏప్రిల్ 11,17, 21, 25,30వ తేదీలలో మిగిలిన ఐదు దశల ఎన్నికలు జరుగుతాయి.
అసోంలో నేడు ఎన్నికలు జరుగబోయే 65 సీట్లకు 539 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. అసోంలో అధికార కాంగ్రెస్ పార్టీకి భాజపా కూటమికి మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుంది. ఈ ఎన్నికల కోసం భాజపా, అసోం గణ పరిషత్, బి.పి.ఎఫ్.లతో జత కట్టింది. మళ్ళీ ఈ రెంటికీ ఏ.ఐ.డి.యు.ఎఫ్. గట్టి పోటీ ఇవ్వవచ్చని తెలుస్తోంది. అది ఈ మొదటి దశ ఎన్నికలలో 27 స్థానాల నుంచి పోటీ చేస్తోంది. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించి మళ్ళీ అధికారం దక్కించుకోవడం చాలా కష్టమని సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. కానీ భాజపా కూటమి కూడా విజయం సాధించే అవకాశాలు లేవని సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. రెండు పార్టీలకు దాదాపు సమానంగా సీట్లు దక్కించుకోవచ్చని, కనుక అసోంలో ‘హంగ్ అసెంబ్లీ’ ఏర్పడే అవకాశాలున్నట్లు సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. అసోంలో మొత్తం రెండు దశలలో ఎన్నికలు జరుగుతాయి. రెండవ దశ ఎన్నికలు ఈనెల 11న జరుగుతాయి. అసోంలోకి బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు ఆపడానికి సరిహద్దులను మూసివేసి ఏకంగా 40,000 మంది సరిహద్దు భద్రతకు నియమించారంటే అక్కడి పరిస్థితి అర్ధం చేసుకోవచ్చును.