కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీకి ఎదుర్కొన్న తొలి ఎన్నికలే చేదు ఫలితాలు రుచి చూపనున్నట్టు వెల్లడైంది. ఆయన సారధ్యంలో పార్టీ తొలి పరాజయాలు మూట కట్టుకోనుంది. ఇవీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న మాట. ఇవే నిజమైతే రాహుల్ కెరీర్ పై ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
ఈ నెల18న ఫలితాలు వెల్లడి కానున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భాజాపా స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ఎగ్జిట్ సర్వేలు తేల్చేశాయి. దాదాపు అన్ని సర్వేలూ హిమాచల్ ఫలితం ఏక పక్షంగా, గుజరాత్ లో కాంగ్రెస్ గట్టి పోటీని అంచనా వేశాయి.
హిమాచల్ విషయం లో కాంగ్రెస్ పెద్దగా ఆశలు పెట్టుకోనప్పటికీ గుజరాత్ మాత్రం తమ వైపు మొగ్గుతుందని ఆశించింది. తమ నూతన అధ్యక్షుడికి ఇది ప్రారంభ కానుక అవ్వాలని కోరుకుంది. అయితే ఆ ఆశలు నీరుగారెలా ఉన్నాయి. దాదాపు అన్ని సర్వేలూ గుజరాత్ లో కాంగ్రెస్ 60 నుంచి 70 సీట్లకు పరిమితం కానుందని తేల్చాయి.
ఈ నేపద్యంలో… గుజరాత్ లో ఓటమి సంభవిస్తే అది రాహుల్ భవిష్యత్హు మీద తప్పక ప్రభావం చూపుతుంది అని కాంగ్రెస్ సీనియర్లు అoదోళన చెందుతున్నారు. అయితే దాదాపు 22 ఏళ్లుగా గుజరాత్ ప్రజల గుండె చప్పుడు లా మారిన భాజపా ను ఈ సారి ఏకపక్షంగా గెలవనీయకుండా చేసినా కూడా అది చెప్పుకోదగ్గ విజయమే అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
విపరీతమైన ప్రజాదరణ ఉన్న మోడీ స్వంత రాష్ట్రంలో కాళ్ళు అరిగేలా తిరిగేలా చేసి, కొన్ని దిగజారుడు ఆరోపణలు కూడా చేసేలా భయపెట్టగలిగాం అని అంటున్నారు. ఈ నేపథ్యంలో మరో 3 రోజుల్లో రాహుల్ కెరీర్ ను కీలక మలుపు తిప్పే ఫలితాలు, తదనంతర ప్రభావాల కోసం వేచి చూడాలి.