ప్రధాని నరేంద్ర మోడీతో సహా మంత్రులు, భాజపా నేతలు అందరూ ముక్తకంఠంతో చాలా గొప్పగా చెప్పుకొనే విషయం ఏమిటంటే రెండేళ్ళ తమ పాలనలో తమ ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని! కానీ మోడీ ప్రభుత్వం కూడా అవినీతికి మినహాయింపు కాదని కాంగ్రెస్ పార్టీ వాదన. అందుకు సాక్ష్యంగా కాగ్ నివేదికని పేర్కొంటోంది. మోడీ ప్రభుత్వం రూ. 45,000 కోట్ల టెలికాం కుంభకోణాన్ని దాచిపెట్టి రిలయన్స్, వోడాఫోన్, ఐడియా, భారతి ఎయిర్ టెల్, ఎయిర్ సెల్, టాటా టెలికాం సంస్థలని కాపాడేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు.
ఆ ఆరు ప్రముఖ టెలికాం సంస్థలు ప్రభుత్వానికి పన్నులు ఎగవేసేందుకుగాను తమ ఆదాయాలని తక్కువచేసి, ఖర్చులని ఎక్కువ చేసి చూపిస్తున్నట్లు అనుమానం రావడంతో తమ యూపియే ప్రభుత్వ హయంలో వాటి ఆదాయ వ్యయాలపై కాగ్ చేత ఆడిట్ చేయించామని చెప్పారు. 2006 నుంచి 2010 వరకు ఆడిట్ చేసిన లెక్కల ప్రకారం ఆ ఆరు కంపెనీలు కలిపి రూ. 46,045.75 కోట్ల ఆదాయాన్ని తక్కువ చేసి చూపినట్లు కాగ్ కనుగొందని తెలిపారు. అవి రూ.12,488.93 కోట్లు చెల్లించకుండా తప్పించుకొన్నాయని కాగ్ నివేదికలో నిర్ధారించిందని పేర్కొన్నారు. కాగ్ తన నివేదికని మోడీ ప్రభుత్వానికి సమర్పించిచాలా రోజులైనప్పటికీ, దానిని ఇంతవరకు బహిర్గతం చేయకుండా దాచిపెట్టి ఆ ఆరు టెలికాం కంపెనీలని కాపాడే ప్రయత్నం చేస్తోందని రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు. దానిపై నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీదే కనుక ఆయన కాగ్ నివేదికని త్రొక్కి పట్టి, ఇంత బారీ కుంభకోణాన్ని దాచిపెట్టి తమ ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని గొప్పలు చెప్పుకొంటున్నారని రణదీప్ సూర్జేవాలా విమర్శించారు. కనుక మోడీ ప్రభుత్వం తక్షణమే కాగ్ నివేదికని బయటపెట్టి ఆ ఆరు కంపెనీల దగ్గర నుంచి ఆ సొమ్ముని జరిమానాలతో సహా రాబట్టాలని రణదీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు.
దీనిని బయటపెట్టి కాంగ్రెస్ పార్టీ ఏదో ఘనకార్యం సాధించినట్లు లేదా మోడీ ప్రభుత్వాన్ని ఇన్నాళ్ళకి గట్టిగా దెబ్బ తీయగలిగినందుకు సంతోషపడవచ్చు. కానీ ఈ కుంభకోణం కూడా తమ యూపియే హయంలోనే జరిగిందని స్వయంగా చాటింపు వేసుకొనట్లయింది. అయితే టెలికాం సంస్థల అవినీతి గురించి కాగ్ సమర్పించిన ఆ నివేదికని మోడీ ప్రభుత్వం ఇంతవరకు బయటకు చెప్పకపోవడం, దాని ఆధారంగా ఆ ఆరు కంపెనీలపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కాంగ్రెస్ ఆరోపణలని విశ్వసించవలసి వస్తోంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎదుర్కొంటున్న మొట్ట మొదటి అవినీతి ఆరోపణ ఇదేనని చెప్పక తప్పదు. దీనిపై బహుశః కేంద్రమంత్రులు లేదా భాజపా నేతలో కాంగ్రెస్ పార్టీకి గట్టిగానే సమాధానం చెప్పవచ్చు. అయితే ఇప్పటికైనా ఆ ఆరు సంస్థలపై చర్యలు తీసుకోకపోతే మోడీ ప్రభుత్వం విశ్వసనీయత దెబ్బ తింటుంది.
ఈ నెల 18 నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలవబోతున్నాయి కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈ విషయం బయటపెట్టి ఉండవచ్చు. దీనిపై మీడియాలో ఎలాగూ చర్చలు జరుగుతాయి కనుక పార్లమెంటు సమావేశాలు మొదలయ్యేలోగా ఇంకా వేడి పెరుగుతుంది. అప్పుడు పార్లమెంటులో మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడాలనే ఉద్దేశ్యంతోనే ఈ విషయాన్ని ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ బయటపెట్టి ఉండవచ్చు. అలాగే ఉత్తరప్రదేశ్, పంజాబ్ శాసనసభ ఎన్నికల ప్రచారం కూడా మొదలయింది కనుక అక్కడా దీనిని ఉపయోగించుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందేమో?
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ టెలికాం సంస్థలతో వాటికి చాలా బలమైన స్నేహసంబందాలే ఉన్నాయి కనుకనే అవి యదేచ్చగా నిర్భయంగా ఇటువంటి ఆర్ధిక నేరాలకి పాల్పడగలుగుతున్నాయని చెప్పవచ్చు. నాటి 2జి,3జి మొదలుకొని నేటి 4జి వరకు బారీ స్థాయిలో కుంభకోణాలు కొనసాగుతూనే ఉన్నాయని, అన్ని ప్రభుత్వాలు టెలికాం సంస్థలకి ‘జీ జీ’ అంటూనే ఉన్నాయని మరోమారు నిరూపితమయ్యింది. అంతేకాదు ఇటువంటి కుంభకోణాలు అధికార ప్రతిపక్షాలు రాజకీయ చదరంగం ఆడుకోవడానికి మాత్రమే వాడుకొంటాయి తప్ప టెలికాం కంపెనీలని గాడిలో పెట్ట(లే)వని మరోమారు నిరూపించబడవచ్చు.