ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో ‘డాకూ మహారాజ్’ ఒకటి. బాలకృష్ణ – బాబీ కాంబోలో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. ఇంకో నెల రోజుల సమయం ఉంది. అయినా ఇప్పటి నుంచే ప్రమోషన్లు మొదలెట్టేశారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఈ రోజు విడుదల చేశారు. ‘డేగా.. డేగా’ అంటూ సాగే ఈ గీతాన్ని అనంత శ్రీరామ్ రాశారు. తమన్ స్వర పరిచారు. భరత్ రాజ్, నకాష్ అజీజ్, రితీజ్, ప్రణతి ఆలపించారు. పాటలో బీట్, రిథమ్ బాగున్నాయి. వినగానే ఎక్కేసే ఇనిస్టెంట్ ట్యూన్. ఎలివేషన్లకు బాగా నప్పే.. పాట ఇది.
‘గుర్రంపై నరసింహాం చేసే సవారీ ఇదేగా
చెడె చెడునిక పడగొట్టేలా
వేశాడు ఇక్కడ పాగా
తన అడుగుల చప్పుడు వింటే
డోకాలకింక దడేగా’ .. ఇలా చాలా రిథమిక్ గా సాగింది సాహిత్యం.
గుక్కెడు నీళ్లకి పాటు నిరు పేదల బాధల గొంతుకగా
గుప్పెడు బువ్వకి కష్టపడే కడు దీనుడి చేతికి గొడ్డలిగా
రగిలిన రగతపు ఉప్పెనగా… హీరో క్యారెక్టర్ ఎలివేషన్‌కు దోహదపడేలా పాట సాగింది.
బహాయి హో యాడీ
హో యాడీ వేరచి యాడీ… అనే మాటలు ఈ పాటలో వినిపించాయి. దానికి అర్థమేమిటో.. ఏ సందర్భంలో వాడారో.. సినిమా చూస్తే తెలుస్తుందేమో.
‘డాకూ మహారాజ్’ వరల్డ్ బిల్డింగ్ ఈ పాటలో కాస్త యానిమేషన్ రూపంలో చూపించారు. గన్నులు, గుర్రాలూ, బంధిపోటు ముఠాలూ.. ఇలా ఓ కొత్త ప్రపంచం కళ్లముందు కనిపించింది. ఈ పాట వింటే ‘జైలర్’లో టైటిల్ సాంగ్ గుర్తొస్తుంది. బహుశా.. తమన్ కూడా అలాంటి పాట చేద్దామనే ఉద్దేశంతో ‘డాకూ..’ ట్యూన్ చేసి ఉండొచ్చు.