సాహోపై ప్రభాస్ అభిమానులే కాదు, యావత్ తెలుగు చిత్రసీమ కూడా భారీగా ఆశలు పెంచేసుకుంది. బాహుబలి రికార్డుల్ని కాస్త కదిపే దమ్ము ఈ సినిమాకే ఉందని ప్రభాస్ అభిమనులు సైతం నమ్ముతున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టేసింది యూవీ క్రియేషన్స్. ఆ ఖర్చు, శ్రమ అంతా టీజర్లో కనిపించింది కూడా. ఇప్పుడు సాహో సింగిల్స్ ఒకొక్కటిగా విడుదల అవుతున్నాయి. ఈ రోజు సాహో తొలి పాట బయటకు వచ్చింది. `సైకో` అంటూ సాగిన ఈ పాటని లిరికల్ వీడియో కాకుండా, డైరెక్ట్‌గా వీడియో పాటే విడుదల చేయడం ప్రభాస్ అభిమానులకు పండగ ముందే వచ్చినంత సంతోషం వేసింది.
అయితే.. ఆ పాట కాస్త హిందీ పాటకి డబ్బింగ్‌లా క(వి)నిపించడం ఇబ్బందిగా మారింది. ముందు హిందీలో తీసి, ఆ తరవాత తెలుగులో డబ్బింగ్ చేసినట్టు లిప్ సింక్‌ని బట్టి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. శ్రద్దా కపూర్ లిప్ మూమెంట్ నాన్ సింక్‌లో ఉందంటే ఓ అర్థం ఉంది. ప్రభాస్ విషయంలోనూ అదే జరిగింది. బాలీవుడ్ సంగీత దర్శకుడు తనిష్క్ ఈ పాటకు స్వరాలు అందించారు. ఇది పక్కా వెస్ట్రన్ బీట్తో సాగిన పాట. తెలుగు పదాలు అస్సలు అర్థం కావడం లేదు. ప్రభాస్ కాస్త జాలీగా స్టెప్పులేయడం, తను స్టైలీష్‌గా ఉండడం, పాటని రిచ్ లుక్‌లో తీర్చిదిద్దడం కాస్త ఉపశమనం కలిగించాయి. ఈ పాట ఒక్కటే ఇలా ఉంటుందా? లేదంటే.. అన్ని పాటలూ ముందు హిందీలో తీసి, ఆ తరవాత తెలుగులోకి డబ్ చేశారా? అనే అనుమానం కలుగుతోంది. హిందీ మార్కెట్‌పై సాహో చిత్రబృందం చాలా ఆశలు పెట్టుకుంది. వాళ్లని అలరించడానికో `ఇది హిందీ సినిమానే` అని వాళ్లని బలంగా నమ్మించడానికో… హిందీకి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోంది. హిందీ, తెలుగులో ఏకకాలంలో సినిమాని తెరకెక్కిస్తున్నప్పుడు ప్రతీ సీనూ, ప్రతీ షాటూ రెండు భాషల్లోనూ తెరకెక్కిస్తుంటారు. సాహో మాత్రం ముందు హిందీలో తీసి, ఆ తరవాత తెలుగులోకి డబ్ చేసినట్టు అనిపిస్తోంది. సన్నివేశాలూ ఇలానే చేస్తే మాత్రం తెలుగులో సాహోకి నెగిటీవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి `సాహో`లో ఏం జరిగిందో..?? ఈ సినిమాని ఎలా తీశారో? మరో పాట బయటకు వస్తే గానీ తెలీదు.