కేంద్ర సాయంతో నిమిత్తం లేకుండా కడపలో ఉక్కు కర్మాగారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అయితే, దీన్ని కేవలం ఒక మామూలు కార్యక్రమంగా మాత్రమే ప్రతిపక్షం చూస్తుంది. ఇదేదో పబ్లిసిటీ కోసం ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమంగా విమర్శలూ విశ్లేషణలూ చాలా చేస్తుంది. వాస్తవాలకు దూరంగా, భవిష్యత్తుపై ఏమాత్రం ఆశాభావ దృక్పథం లేకుండా, ప్రతీదాన్నీ రాజకీయ కళ్లజోడు తగిలించుకుని చూసే జీవీఎల్ లాంటి వారి విమర్శల్ని కాసేపు పక్కనపెడితే… ఈ శంకుస్థాపన వల్ల ఫ్యాక్టరీ నిర్మాణం నూటికి నూరుశాతం పూర్తవడానికి ఉన్న అవకాశాలు కనిపిస్తాయి.
మొదటి అవకాశం… కేంద్రంలో ఎల్లకాలమూ మోడీ ప్రభుత్వమే ఉండదు. ఓడలు బళ్లు అవడానికి ఎక్కువ కాలం పట్టదు. కాబట్టి, ఇప్పుడు కడప ఫ్యాక్టరీ విషయంలో కొర్రీలు పెడుతున్న భాజపా ప్రభుత్వం మారితే… మరో ప్రభుత్వం వచ్చాక దీన్ని కేంద్రం తమ అధీనంలోకి తీసుకుని నిర్మించుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఇక, ఖనిజన వనరుల లభ్యతకు సంబంధించిన పూర్తి నివేదిక ఇంకా రాకపోవడం వల్లనే… ఫ్యాక్టరీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆలస్యమైందన్నది భాజపా వాదన. దాదాపు కొన్నేళ్ల కిందట, వైయస్ హయాంలో కడప జిల్లాల్లో బ్రహ్మణీ స్టీల్స్ పేరుతో గాలి జనార్థన్ రెడ్డి ఫ్యాక్టరీ పెట్టేందుకు అనుమతులు వచ్చాయి కదా! అంటే, ఖనిజ వనరుల లభ్యతను సరిచూసుకోకుండానే నాడు ఒక ప్రైవేటు ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతులు ఇచ్చేసినట్టా..? ఇంకా ఇప్పుడు కావాల్సిన నివేదికలు ఏమున్నట్టు..? అంటే, కర్మాగారం నిర్మాణానికి కేంద్రం ఇప్పుడు చూపుతున్న అభ్యంతరాలు కేవలం రాజకీయ కోణం నుంచి పుట్టుకొచ్చినవే. కేంద్రంలో ప్రభుత్వం మారితే… ఇవన్నీ మారడానికి కచ్చితంగా ఉన్నాయి. విభజన చట్టాన్ని గౌరవించే కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకరోజు వస్తుంది.
రెండో అవకాశం… ఒకవేళ ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్రం ముందుకు రాకపోయినా, వివిధ బ్యాంకుల నుంచీ, ద్రవ్య సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వమే నిధులు సేకరించి పూర్తి చేయగలదు. ప్రైవేటు ఫ్యాక్టరీల నిర్మాణాలకు అప్పులు ఇచ్చే బ్యాంకులు… ఒక రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టుకు నిధులు కచ్చితంగా ఇస్తాయి. దీంతోపాటు, రాష్ట్రంలో పరిశ్రమలకు అనువైన వసతులను కల్పించగలిగే నాయకత్వంలో పాలన ఉందనే నమ్మకంతో ప్రైవేటు సంస్థలూ పెట్టుబడులకు ముందుకొస్తాయి.
మూడో అవకాశం,… కడప ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసేయడం వల్ల… తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏర్పాటయ్యే ప్రభుత్వాలను ప్రజలు ప్రశ్నించే అవకాశం దక్కుతుంది. ఇప్పుడు జరిగిన ఫ్యాక్టరీ నిర్మాణ పనుల ప్రారంభాన్ని తరువాత వచ్చే ఏ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా, ఆలస్యం చేసినా… ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రజాగ్రహానికి గురి కావాల్సివస్తుంది. సో.. ఎలా చూసుకున్నా ఈ శంకుస్థాపన కార్యక్రమం కచ్చితంగా ఒక ముందడుగే. ఈ అవకాశాలను అర్థం చేసుకోలేనివారు మాత్రమే… దీనిపై విమర్శలు చేస్తారనడంలో సందేహం లేదు.