ఎవరికైనా అప్పు పుట్టాలంటే వున్నదానికన్నా ఘనంగా కనిపించాలి. మన దేశంలో ప్రభుత్వాలకు అప్పు చేసే అవకాశం రావాలంటే ఆదాయం భారీగా చూపించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నది. ఆశించిన ఆదాయం రాక కేంద్రం సహాయం చేయక నిధులకు కటకటగా వుంది. ఒకే ఒక తరుణోపాయం అప్పులు తేవడం. అయితే అప్పు తెచ్చుకోవడానికి కేంద్రం ఒప్పుకోవాలంటే ఆదాయం ఘనంగా వుండాలి. అభివృద్ధి మెరుగ్గా వుందని చెప్పుకుంటున్నా ఎపికి రావలసిన ఆదాయం రావడం లేదు. 57 వేల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని ఆశపెట్టుకుంటే 40 వేల కోట్లుకూడా రాలేదు. పన్నుల వసూలు లక్ష్యం 56,850 కోట్లు వుంటే 38 వేల కోట్ల వరకే వచ్చింది. వాణిజ్య పన్నుల విషయంలో ఇది మరీ దారుణంగా వుంది. ఆదాయం ఉత్పతి అంటే జిఎస్డిప్తి ఎక్కువగా వుంటే గాని అప్పులు తెచ్చుకోవడానికి కేంద్రం ఒప్పుకోదు.బాగా లాభదాయకమైన సేవా రంగం వెనకబడివుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదివరకే ప్రకటించి వున్నారు. దానికి సంబంధించి పెట్టుబడితక్కువగానూ రాబడి ఎక్కువగానూ వుంటుంది. అది తక్కువగా వుండటంతో ప్రభుత్వం మత్స్యరంగంపై కేంద్రీకరించింది. ప్రాథమిక రంగంలో 25 శాతం వృద్ధి చూపించడానికి ఆధారం ఆక్వానే. ఈ రంగం 47 శాతం పెరుగుదల చూపించినట్టు లెక్కకట్టి దాన్ని వ్యవసాయానుబందంగా చెబుతున్నారు. దీనివల్ల జిఎస్డిపి అధికంగా కనిపిస్తుంది గాని ఆదాయం మాత్రం రాదు. కాకపోతే సేవారంగం బాలేదు గనక చేపల రంగం ఎక్కువ చేసి చూపించి అప్పులకు అవకాశం పొందుతున్నారట.అనంత కోటి ఉపాయాలంటే ఇవే మరి.