ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల్లో చేపల దుకాణాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్లు కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో చేపల అమ్మకాల కోసం ప్రత్యేకంగా స్టాళ్ల నిర్మాణం కోసం దిగువ స్థాయి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వం ఫిష్ ఆంధ్రా హబ్‌లు ఏర్పాటు చేస్తుంది. వీటి ద్వారా చేపలను గ్రామ, వార్డు సచివాలయాలకు పంపుతారు. అక్కడ అమ్మకాలు చేస్తారు.
ఫిష్ హబ్‌లు ఏర్పాటు చేసి.. వాటి పరిధిలోని 30 నుంచి 35 కిలోమీటర్ల పరిధిలో గ్రామ, వార్డు సచివాలయాలకు పంపుతారు. ఇంకా రైతుబజారులో స్టాళ్లు ఖాళీగా ఉంటే చేపలు విక్రయించేందుకు ఇస్తారు. ఇప్పటికే మొబైల్ సర్వీసుల ద్వారా చేపలను విక్రయించేందుకు చర్యలు చేపట్టారు. చేపలను ఆంధ్రా బ్రాండ్ పేరిట ప్రజలకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వివిధ శాఖలకు సంబంధించిన ఖాళీ స్థలాలు మున్సిపల్, పంచాయతీ, మార్కెట్ యార్డుల్లో ఫిష్ ఆంధ్రా స్టాళ్లు పెట్టుకునేవారికి ఇవ్వానున్నారు.
చేపల అమ్మకాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే పుర ప్రజలకు సేవలు అందించాల్సిన చోట.. చేపల మార్కెట్లు పెట్టాలని నిర్ణయించుకుంది. అయితే అక్కడ అమ్మేదెవరు..? ఉద్యోగులా.. లేకపోతే ఫ్రాంచైజీ తీసుకునేవారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఉద్యోగులతో అమ్మిస్తే ప్రయోజనం ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.