విలీన మండలాల్లోని ఐదు గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. తాము ఏపీలో భాగంగా ఉండలేమని తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనే ఐదు పంచాయతీలు తీర్మానాలు చేశాయి. అవన్నీ వైసీపీ సపోర్టర్ల పంచాయతీలు కావడంతో తర్వాత రెండు , మూడు గ్రామాల కు చెందిన కొంత మంది ప్రతినిధులతో అలాంటి తీర్మానాలు చేయలేదని చెప్పించారు. కానీ ఇప్పుడు ప్రజలు రోడ్డెక్కుతున్నారు.
తాజాగా ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో రాస్తారోకో చేశారు. తమ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని నడిరోడ్డుపై బైటాయించి భారీ ఎత్తున ధర్నా చేశారు. ‘జై తెలంగాణ.. ఆంధ్రా వద్దు – తెలంగాణ ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసనలో పిచ్చుకలగూడెం, కన్నాయిగూడెం, ఎటపాక, పురుషోత్తంపట్నం, గుండాల గ్రామాల ప్రజలు భారీగా పాల్గొని, తమను భద్రాచలంలో కలపాలని డిమాండ్ చేశారు.
తాము సమస్యలు వచ్చినప్పుడు కోర్టుకు, ఆర్డీఓ ఆఫీసుకు, కలెక్టరేట్‌కు వెళ్లాలంటే ఏపీలో కలవడం మూలంగా నాలుగు గంటలు పడుతుందని, 40 కిలోమీటర్ల దూరం ఉన్న భద్రాచలంలో కలిపితేనే తమ సమస్యలు తీరుతాయని వెల్లడిస్తున్నారు. ఇటీవల మంత్రి పువ్వాడ అజయ్ కూడా గోదావరి కరకట్ట కట్టడానికి ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలన్నారు. సాంకేతికంగా సాధ్యం కాదని తెలిసినా ఈ అంశాన్ని రోజు రోజుకు హైలెట్ చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.