నిజంగా ఇది నమ్మలేని నిజమే. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా కాకపోయినా, చిన్న పాత్ర దక్కినా చాలని చాలా మంది హీరోయిన్లు తపించిపోయే వారు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆయన 150 సినిమాలో హీరోయిన్ కోసం పెద్ద కసరత్తే చేయాల్సి వచ్చింది. అన్నివిధాలా సరైన హీరోయిన్ ఎవరా అని అన్వేషించారు.
ఇందులో భాగంగా కొందరిని సంప్రదించారు. అయితే వాళ్ల నుంచి నెగెటివ్ జవాబు రావడం చూసి సినిమా యూనిట్ షాకైంది. తన సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఉంటే బాగుటుందని చిరంజీవి భావించారట. దీంతో మొదట కరీనా కపూర్ ను సంప్రదించారని, తల్లి కాబోతున్నందున సినిమా ఒప్పుకోలేనని ఆమె చెప్పిందట.
ఆ తర్వాత దబంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను సంప్రదించారట. కానీ డేట్స్ ఖాళీ లేవని ఈ ఆఫర్ కు నో చెప్పిందట. దీంతో మరో అందాల నటి కత్రినా కైఫ్ ను సంప్రదించారట. తాను బాలీవుడ్ హీరోయిన్ గానే కొనసాగుతానని, దక్షిణాది సినిమాల్లో నటించే ఉద్దేశం లేదని తేల్చి చెప్పిందట. మెగాస్టార్ సినిమా అయినా సరే సౌత్ సినిమాలకు తాను దూరమని స్పష్టంగా చెప్పిందట.
ఆ తర్వాత బాలీవుడ్ అనే సెంటిమెంట్ వద్దనుకుని, తెలుగు హీరోయిన్ కోసం అన్వేషించారు. ఇందులో భాగంగా అనుష్కను దర్శకుడు వినాయక్ సంప్రదించారట. కానీ ఆమె ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపలేదని టాక్. ఆ తర్వాత నయన తార కోసం ప్రయత్నించినా ఆమె కూడా అంత ఆసక్తి చూపలేదట.
అటు తర్వాత ఒక్క పేరు విషయంలో మాత్రం అంతా ఫిక్స్ అయ్యారట. ఆ పేరే, కాజల్. మగధీర మిత్రవింద కాజల్ ను ఎలాగైనా ఓకే చేయాలని ప్రయత్నించారు. రెమ్యునరేసన్ విషయంలో తర్జనభర్జనలు జరిగినా చివరకు కాజల్ ఓకే చెప్పింది. ఈమధ్యే సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం సినిమాలు కాజల్ ను నిరాశ పరిచాయి. అయినా మెగాస్టార్ సినిమా ఆఫర్ రావడంతో తనకు మళ్లీ మంచి రోజులు వస్తాయని క్యూట్ కాజల్ భావిస్తోందట. చిరంజీవికి సరైన జోడ కాజలే అని ఆ సినిమా యూనిట్ ఇప్పుడు ఫిక్స్ అయింది.