2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ 11 లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది. మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, నాగర్ కర్నూల్, ఖమ్మం, నల్గొండల్లో ఓడిపోయింది. మిగతా చోట్ల.. టీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో అడ్వాంటేజ్ సాధించినా… ఖమ్మంలో మాత్రం వెనుకబడ్డారు. అందుకే ఖమ్మం జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ ను కొనసాగిస్తున్నారు. ఖమ్మం లోక్ సభ పరిధిలోని ఎమ్మెల్యేలను కారెక్కిస్తున్నారు. ఇప్పటికే వైరా నుంచి గెలిచిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాములునాయక్ గులాబీ కండువా కప్పుకోగా సండ్ర వెంకటవీరయ్య , కందాల ఉపేందర్ రెడ్డి కూడా త్వరలోనే ఆ పార్టీలో చేరుతామని ప్రకటించారు. దీంతో అడ్వాంటేజ్ సాధించామని టీఆర్ఎస్ అనుకుంటోంది.
నాగర్ కర్నూల్ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండటంతో ఈసారి ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ఒక్క కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగతా స్థానాల్లో టిఆర్ఎస్ విజయం సాధించింది. నల్గొండ పార్లమెంట్ గెలుపుకోసం గులాబీ బాస్ కెసీఆర్ గత రెండేళ్ల నుంచే కసరత్తు మొదలుపెట్టారు. జిల్లాలో బలమైన నేతగా ఉన్న కంచర్ల భూపాల్ రెడ్డికి నల్లగొండ అసెంబ్లీ సీటు ఇచ్చి గెలిపించారు. తాజాగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడ టిఆర్ఎస్ లో చేరతానని ప్రకటించడంతో నల్గోండ ఎంపీ స్థానంలో విజయం సాధించడంపై టీఆర్ఎస్ ధీమాగా ఉంది. సికింద్రాబాద్, మల్కాజ్ గిరి స్థానాలపై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది టిఆర్ఎస్. గతంలో సికింద్రాబాద్ నుంచి భీమ్ సేన్ ను బరిలో నిలపగా మూడో స్థానానికే టిఆర్ఎస్ పరిమితం అయింది. దీంతో ఈసారి ఎలాగైనా లష్కర్ పై జెండా ఎగురవేయాలని కంకణం కట్టుకున్నారు గులాబీ నేతలు. ముఖ్యంగా ఆ పార్లమెంటరీ నియోజకవర్గంలోని కీలక ఎమ్మెల్యేలతో పాటు మంత్రి తలసానికి బాధ్యతలు అప్పగించారు. దీంతో వారంతా ఆ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు.
ఇక మల్కాజ్ గిరి పార్లమెంట్ నుంచి గత ఎన్నికల్లో మైనపల్లి హనుమంతరావు పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి మాత్రం ఈ సీటును గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. ఈ నియోజకవర్గ బాధ్యతను మంత్రి మల్లారెడ్డికి అప్పగించారు. మల్లారెడ్డి అన్నీ తానై ఈ పార్లమెంట్ ను గెలిపించుకునేందుకు నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక చేవెళ్ల నియోజకవర్గాన్ని చాలెంజ్ గా తీసుకున్నారు కెసీఆర్. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో…గులాబీ బాస్ కెసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలో బలమైన నేతగా ఉన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని చేర్చుకున్నారు. మిగతా స్థానాల్లో ఈజీగా గెలుస్తామనుకుంటున్న టీఆర్ఎస్.. ఈ ఐదింటిపై మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.