ప్రజాప్రతినిధులుగా ఎన్నికవడమే చాలా కష్టం అనుకొంటే ఏకంగా కేంద్రమంత్రి పదవి దక్కితే అది చాలా గొప్ప అదృష్టంగానే భావించవచ్చు. రెండున్నరేళ్ళ క్రితం కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆ కూటమిలో సభ్యులుగా ఉన్న అన్ని పార్టీలకి ఒకటో రెండో కేంద్రమంత్రి పదవులు దక్కాయి. ఎన్డీయే ప్రభుత్వం భాజపా నేతృత్వంలో ఏర్పడింది గాబట్టి ఎక్కువ పదవులు ఆ పార్టీ ఎంపిలకే దక్కాయి. ఈరోజు ఐదుగురు మంత్రులకి మోడీ ఉద్వాసన పలికారు. వారి పనితీరు సంతృప్తికరంగా లేదనే కారణంతోనే వారిని బయటకి పంపినట్లు తెలుస్తోంది. ఈ రోజు పదవులు కోల్పోయిన వారిలో నిహాల్ చంద్, రామశంకర్ కఠారియా, సన్వర్లాల్ జాట్, మనుసుఖ్భాయ్ వాస్వా, ఎం.కె.కుందారియాలు ఉన్నారు. విశేషమేమిటంటే ఆ ఐదుగురు కూడా భాజపాకి చెందినవారే కావడం. ఈరోజు కనీసం ముగ్గురు కేంద్ర మంత్రులకి క్యాబినెట్ హోదా కలిపిస్తారని వార్తలు వచ్చినప్పటికీ కేవలం ప్రకాష్ జవదేకర్ ఒక్కరికే పదోన్నతి కల్పించడం మరో విశేషం.
కొత్తగా చేరిన 19మందిలో అసోం, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, కర్నాటక రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి చెరో ఇద్దరు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ల నుంచి చెరో ముగ్గురు, రాజస్థాన్ నుంచి నలుగురు ఉన్నారు. వచ్చే రెండేళ్ళలో ఎన్నికలు జరుగబోయే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకే కాకుండా ఎన్నికలు పూర్తయిన అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకి కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించడం హర్షణీయమే.