రెండు తెలుగు రాష్ట్రాల న్యాయ, చట్టపరమైన సమస్యలని పరిష్కరించవలసిన ఉమ్మడి హైకోర్టు స్వయంగా పెద్ద సంక్షోభంలో చిక్కుకొందిపుడు. మొన్న ఇద్దరు న్యాయమూర్తులను సస్పెండ్ చేసి మరొకరి డెప్యుటేషన్ రద్దు చేసిన హైకోర్టు ఈరోజు అదే కారణాలతో మరో ఐదుగురు న్యాయమూర్తులని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు సస్పెండ్ అయినవారిలో సున్నం శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్ ప్రసాద్, రమాకాంత్, తిరుపతి, రాధాకృష్ణ చౌహాన్ ఉన్నారు.
మొన్న రవీందర్ రెడ్డి, వరప్రసాద్ లని సస్పెండ్ చేసినందుకే తీవ్ర ఆగ్రహంతో ఉన్న తెలంగాణా న్యాయవాదుల జేయేసి, హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులని తాజా సస్పెన్షన్ తో ఇంకా రెచ్చగొట్టినట్లయింది. చట్టాన్ని అమలుచేయవలసిన న్యామూర్తులు, న్యాయవాదులే రోడ్లెక్కి నిరసనలు తెలియజేస్తూ సవాలు చేస్తుంటే హైకోర్టు చూస్తూ ఊరుకోలేదు కనుక తప్పనిసరిగా వారిపై కూడా చర్యలు తీసుకొంది. అయితే దీని వలన ఈ సమస్య పరిష్కారం కాకపోగా ఇంకా ముదిరిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇంతవరకు న్యాయాధికారుల ప్రాధమిక కేటాయింపుల అంశంపైనే పోరాడుతున్న న్యాయాధికారులు ఇప్పుడు న్యాయమూర్తులని సస్పెండ్ చేసినందుకు మరో కొత్త పోరాటం మొదలుపెట్టారు. అది కూడా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి భోసలేపైనే! ఇది వారికి కానీ న్యాయవ్యవస్తకి గానీ మంచిది కాదు. గౌరవం కాదు.
అయితే ఈ సమస్య కారణంగానే హైకోర్టు విభజన అనివార్యం కావచ్చు. ఎంతో సజావుగా జరుగవలసిన ఆ విభజన ప్రక్రియ కోసం ఏకంగా న్యాయవ్యవస్థే ఈవిధంగా రోడ్డున పడవలసిరావడం చాలా విచారకరం. రాష్ట్ర విభజన విషయంలో యూపియే ప్రభుత్వం ఏవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి సమస్యని జటిలం చేసిందో, హైకోర్టు విభజన విషయంలో మోడీ ప్రభుత్వం కూడా అదేవిధంగా వ్యవహరిస్తూ గోటితో పోయే ఈ సమస్యని గొడ్డలివరకు తీసుకువచ్చింది. కనుక దీనిని తక్షణమే పరిష్కరించవలసిన బాధ్యత కూడా దానిదే! హైకోర్టు విభజన చేయనంత వరకు ఈ సమస్య ఇంకా పెరుగుతుందే తప్ప సమసిపోదని గ్రహించి ఇప్పటికైనా మేల్కొంటే మంచిది.